జైలర్ సక్సెస్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసారు. గత కొన్నేళ్లుగా సక్సెస్ చూడలేని రజినీకాంత్ జైలర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. రెండు వారాలు గడవకముందే 500 కోట్ల క్లబ్ లో కాలు పెట్టారు. జైలర్ రిలీజ్ కి ముందు హిమాలయాలకు వెళ్లొచ్చిన సూపర్ స్టార్ ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ సీఎంని కలిశారు. యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కలిసిన ఆయన.. సీఎం పాదాలకి నమస్కరించడం హాట్ టాపిక్ అయ్యింది.
సూపర్ స్టార్ లాంటి ఆయన యోగి పాదాలు తాకడంపై భిన్నవాదనలు వినిపించాయి. తనకన్నా వయసులో చిన్నవాడైన యోగి ఆదిత్యనాథ్ పాదాలు రజినీ తాకడంపై ఆయన అభిమానులు రకరకాలుగా స్పందించారు. కొందరికి అది నచ్చలేదు. మరొకొందరు యోగుల కాళ్ళకి నమస్కరిస్తే తప్పులేదు.. రజిని సింపుల్ సిటీలో భాగంగానే ఆదిత్యనాథ్ పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారంటూ ఆయనకి సపోర్ట్ చేసారు. యుపి సీఎంని కలిసిన తరవాత రజినీకాంత్ భార్య లత తో కలిసి అయోధ్య రామమందిర నిర్మాణం జరిగే ప్రదేశాన్ని సందర్శించారు.
ఇక తాజాగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టిన సూపర్ స్టార్ తాను సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకడంపై వివరణనిచ్చారు. యోగులు, సన్యాసుల పాదాలకి నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం నాకు అలవాటు. వారు నాకన్నా వయసులో చిన్నవారైనా నేను పాద నమస్కారం తప్పకుండా చేస్తాను.. అందుకే నాకన్నా వయసులో చిన్నవాడైన యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాను. అంతకు మించి వేరే ఉద్దేశ్యం లేదు అంటూ రజినీకాంత్ చెప్పారు.