ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేరయ్యాక కనుమరుగైన నేతలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఏపీలో చాలా మంది కాంగ్రెస్ నేతలు జాడ లేకుండా పోయారు. అలాంటి వారిలో ఒకరు ఎన్.రఘువీరారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఈయన వీరవిధేయుడు. ఆ పార్టీ హయాంలో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూ ఏపీసీసీ చీఫ్‌గా పని చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ వేరయ్యాక కాంగ్రెస్ పార్టీ పతనం ఏపీలో ప్రారంభమైంది. అక్కడి కాంగ్రెస్ నేతలంతా ఓటమి పాలయ్యారు. రఘువీరా కూడా రెండు పర్యాయాలు ఓటమి పాలయ్యారు. దీంతో రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి సొంతూరులోనే వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితం గడిపారు.
రాజకీయాలకు రఘువీరా పూర్తి స్వస్తి పలికారు అనుకుంటున్న సమయంలో ఆసక్తికర టర్న్. ఆయన రిటైర్మెంట్ ప్రకటించాననుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం అంగీకరించలేదు. ఆయనకు తాజాగా ఓ కీలక పదవి అప్పగించింది. అత్యంత కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా రఘువీరాను అధిష్టానం నియమించింది. అసలే ఎన్నికల టైమ్.. చేతిలో పదవి. ఇక రఘువీరారెడ్డి రాజకీయాల్లో మరింత స్పీడ్ పెంచుతారని తెలుస్తోంది. అసలు రాజకీయ క్షేత్రంలో కనుమరుగైపోయి వ్యవసాయ క్షేత్రంలో దర్శనమిచ్చిన ఆయన ఇప్పుడు తిరిగి అనూహ్యంగా రీ ఎంట్రీ ఇచ్చారు. రఘువీరా తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారనే న్యూస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
నిజానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్న రఘువీరాను పలు రాజకీయ పార్టీలు సంప్రదించినప్పటికీ ఆయన ససేమిరా అన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. టీడీపీ, వైసీపీలు తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికాయట. అయితే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏపీలో పాదయాత్ర నిర్వహించిన సమయంలో రఘువీరా ఆయనను కలిశారు. ఆ సమయంలో రఘువీరాతో రాహుల్ మాట్లాడారు. ఇక ఇప్పుడు ఏకంగా జాక్‌పాట్ కొట్టేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరు పార్టీ ఎన్నికల పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని రఘువీరారెడ్డి తెలిపారు. మొత్తానికి రాజకీయాల్లో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ సీనియర్స్ అంతా రీ ఎంట్రీ ఇస్తుండటంతో పార్టీకి తిరిగి మంచి రోజులు వచ్చే అవకాశముందనే చర్చ నడుస్తోంది.