సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత సింపుల్ గా ఉంటారో అనేది అందరికి తెలుసు, ఆయన ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా.. ఆ బరువుని మోస్తున్నా.. ఎక్కడా ఆ దర్పణాని చూపరు. బయటికొస్తే ఎంతో సింపుల్ గా సాధారణ వ్యక్తిగా మారిపోతారు. అదే ఆయన అభిమానుల్లో ఆయన్ని అందనంత ఎత్తులో నిలబెట్టింది. సూపర్ స్టార్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు తమిళనాడులో కోకొల్లలు, ఇతర భాషల్లో ఆయనకి అభిమాన గణమేమి తక్కువ కాదు.. కానీ తమిళనాట మాత్రం అది చాలా అంటే కొలమానంలో కొలవడం కష్టమనేంత.
తాజాగా జైలర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ తన భార్య తో కలిసి యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ ని మీటయ్యారు. ఆ సందర్భంగా రజినీకాంత్ సీఎం ఆదిత్యనాథ్ కాళ్ళు మొక్కడంపై ఆయన అభిమానుల్లోనే భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుంటూ సింపుల్ గా నడుచుకునే రజినీకాంత్ ఇలా ఓ యోగి కాళ్ళ మీద పడడం అదికూడా ఆయన కన్నా వయసులో ఎంతో చిన్నవాడైన అదిత్య నాథ్ వాళ్లపై పడడం ఓ వర్గం అభిమానులకి నచ్ఛలేదు.
72 ఏళ్ళ రజనీకాంత్ 52 ఏళ్ళ యోగి ఆదిత్యనాద్ కాళ్లపై పడ్డారు. ఈ విషయాన్ని రజనీకాంత్ ఫ్యాన్స్ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొంతమంది ఆదిత్యనాథ్ ఓ యోగి.. ఆయన కాళ్లపై రజినికాంత్ పడడం తప్పులేదు.. అది ఆయన సింప్లిసిటీలో భాగమే అని కొంతమంది అభిప్రాయపడుతుంటే.. మరికొంతమంది తమ అభిమాన ఆరాధ్య దైవం రజినీకాంత్ అలా తనకంటే చిన్న వయసులో ఉన్న వ్యక్తి కాళ్లపై పడడం ఎంత మాత్రమూ నచ్చలేదు అంటున్నారు. చాలామంది మాత్రం రజనీ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.
మరికొంతమంది రజినీకాంత్ కి దైవ భక్తి కన్నా బీజేపీ భక్తి ఎక్కువైంది.. అందుకే యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై రజిని పడ్డారంటూ ఇలా రకరకాలుగా రజినీకాంత్ యోగి ఆదిత్య నాథ్ కాళ్ళు పట్టుకోవడంపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.