తెలంగాణలో ఎన్నికలకు ముందే బీజేపీ అస్త్ర సన్యాసం చేసిందా? బీజేపీవి ఇప్పటి వరకూ చేసినవన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలేనా? ఇప్పుడు కొందరు బీజేపీ నేతల మాటలు వింటుంటే అది నిజమేనని అనిపిస్తోంది. సంక్షేమ పథకాల్లో కేసీఆర్‌ను కొట్టలేమట. ఎందుకు కొట్టలేరు? కేంద్రంలో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అంతకు మించి చేస్తామనే సత్తా బీజేపీకి లేదా? పైగా కేసీఆర్‌ను తోపు.. తురుముగా భావించి బీజేపీ నేతలు ముందుగానే భయపడిపోతే ఎలా? కేవలం ఆయన ఇచ్చిన హామీలలో లోటు పాట్లను వెలికి తీసి కేసీఆర్‌ను ఓడించడం కష్టం బాబోయ్ అని వెనుకడుగు వేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జ్ మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ ఒక్కటే అని కూడా కితాబు ఇచ్చేశారు. ఒక రాష్ట్ర ఇన్‌చార్జి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ముందుండి జనాన్ని నడిపించాల్సిన వ్యక్తి ఇలాంటి మాటలా? ప్రతిపక్షాలు అన్నట్టుగా రెండు పార్టీలు లోపాయికారిగా ఒక్కటయ్యాయా? లేదంటే కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిని చేసిన తర్వాత పూర్తిగా పార్టీ పతనమైందని ఫిక్స్ అయిపోయారా? పార్టీకి ఓ ఊపు తీసుకొచ్చి.. సెకండ్ ప్లేస్‌లో నిలబెట్టిన బండి సంజయ్‌ని తొలగించి సొంత పార్టీ ఇమేజ్‌ను బీజేపీయే డ్యామేజ్ చేసుకుందనే టాక్ ఇప్పటికే బలంగా వినిపిస్తోంది. అసలు తెలంగాణలో బీజేపీ ఉందా? లేదా? అని పరిస్థితికి ఇప్పుడు వచ్చింది.
ఏ ధర్నాలు చేపట్టినా.. ఆందోళనలు చేపట్టినా కూడా బీజేపీ హైలైట్ కాలేకపోతోంది. ఇది చాలదన్నట్టు.. గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్టుగా.. బీజేపీకి చెందిన కీలక నేతలే ఇలా కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తుతుంటే ఇంకేం పార్టీ మనుగడ ఉంటుంది? మొదటికే మోసం రాదా? కేసీఆర్‌ను కొట్టలేమని ఒక ఇన్‌చార్జి అనాల్సిన మాటేనా? తెలంగాణ అంటే సంక్షేమమేనా? సమస్యలు లేవా? ఉద్యోగుల్లో కేసీఆర్‌పై మాటల్లో చెప్పలేనంత వ్యతిరేకత ఉంది. విద్యార్థుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. నిరుద్యోగ సమస్య, పేపర్ లీకేజ్ వ్యవహారం, రైతుల్లో వ్యతిరేకత.. అసలు కేసీఆర్ ప్రభుత్వంలో సమస్యలు చాంతాడంత. ఎన్నికలు ఏవైనా గేమ్ చేంజర్స్ యూతే. వాళ్లను పట్టుకుంటే ఒక ఆట ఆడుకోవచ్చు. కానీ ఈ పిరికి మాటలేంటని బీజేపీ క్యాడర్ ఫైర్ అయిపోతోంది.