ఒక రాజకీయ పార్టీగా అధినేతగా ఉన్నప్పుడు సీఎం కావడమే అంతిమ ధ్యేయంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. లేదు.. నాకు సీఎం అవ్వాలని లేదు.. నేను అందుకు అర్హత ఇంకా సాధించలేదు అంటే ఎలా? సీఎం కావడానికి అసలు అర్హత ఒకటుందా? ఏదైనా అకౌంట్ ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్‌లో ఒక క్యాపిటల్ ఉండాలి.. ఒక నంబర్ ఉండాలి.. బ్లా బ్లా బ్లా ఉంటుందే.. అలాంటి అర్హతలు ఏమైనా రాజ్యాంగంలో రాసిపెట్టారా ఏంటి? జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితం ఇదే చెప్పారు. తనకు సీఎం అవ్వాలని లేదని.. తనకు ఇంకా ఆ అర్హత రాలేదన్నారు. నిజానికి ఆయన చెప్పిన సందర్భం వేరు. అప్పట్లో అది కరెక్టే. కానీ ఇప్పుడు జనసేనాని స్వరం మారింది. తాను సీఎం అవుతానంటున్నారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయన వ్యూహం మార్చారని పక్కాగా అర్థమవుతోంది. గతంలో తనకు ఇవే చివరి ఎన్నికలని చెప్పి ఆ తరువాత సొంత పార్టీ నుంచే విమర్శలు రావడంతో సైలెంట్ అయిపోయిన చంద్రబాబు.. ఇప్పుడు కొత్త స్వరం అందుకున్నారు. తాను పద్నాలుగున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని.. తనకు సీఎం పదవి కొత్తేం కాదని.. తనకు సీఎం పదవి కంటే కూడా ఏపీ ప్రజల భవిష్యత్తు మాత్రమే ముఖ్యమని తాజాగా వ్యాఖ్యానించారు. మొత్తానికి చంద్రబాబు సరికొత్త వ్యూహానికి తెర తీసినట్టు అర్థమవుతోంది. మరోవైపు పవన్ తనకు సీఎం పదవి కావాలంటున్నారు. ఈ రెండు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒకరిది వ్యూహం మరొకరిది వ్యామోహంలా అనిపించడం లేదా?
గత ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క సీటు సాధించింది. పవన్‌తో సహా అంతా ఓటమి పాలయ్యారు. ఆ తరువాత టీడీపీతో పొత్తు. అప్పట్లో సీఎం సీటుకు తాను అర్హుడిని కానన్న పవన్ .. ఇప్పుడు తాను కూడా అర్హుడినే అంటున్నారు. తప్పేం లేదు. కానీ ముందుగా ఎన్నికలకు వెళ్లి పెద్ద మొత్తంలో సీట్లు కైవసం చేసుకుని అప్పుడు చెప్పొచ్చు బల్లగుద్ది. కానీ కనీసం 50 స్థానాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టలేని పవన్ ఇప్పుడు సీఎం అవుతానని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి? చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి ప్రత్యర్థులను కన్ఫ్యూజ్ చేస్తున్నారని టాక్. ఒకవైపు పవన్‌ను గెలిపిస్తే చంద్రబాబు సీఎం అవుతారన్న ఒక వర్గాన్ని వ్యూహాత్మకంగా దెబ్బకొట్టడం.. అలాగే వైసీపీని గందరగోళంలో పడేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవడం. ఈ వ్యూహంతోనే చంద్రబాబు, పవన్‌ల మాట తీరులో మార్పు వచ్చిందని ప్రచారం జరుగుతోంది.