ఆడపిల్లను ఆడపిల్ల అని ఎందుకంటారు? ఆడపిల్ల కాబట్టి.. పాదాలతో నడిచే యాత్ర పాదయాత్ర.. ఇవి ఎంత ఫేమస్ అయ్యాయో.. వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల కూడా తెలంగాణ రాజకీయాల్లో అంతే ఫేమస్ అయ్యారు. నేషనల్ మీడియా సైతం కొన్ని సందర్భాల్లో ఆమె న్యూస్ కవడం చేయడం విశేషం. అయితే షర్మిల రాజకీయాల మీద కంటే ఫేమస్ అవడం పైనే ఎక్కువగా దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారనుకోండి.. అందులో సందేహం లేదు. ఇప్పుడు పార్టీని కాంగ్రెస్‌లో కలపబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. పదే పదే హస్తిన పర్యటన చేయడం.. కాంగ్రెస్ అధినాయత్వాన్ని కలస్తుండటం ఇందుకు కారణం. అయితే తాజాగా ఓ ఆసక్తికర విషయం జరిగింది. అదేంటంటే.. తన ఇంటికి వచ్చిన పోలీసులకు షర్మిల హారతి ఇచ్చి మరీ ఆహ్వానం పలికారు.
దీనిలో వింతేముంది అంటారా? వింతా వింతన్నరా? ఒకప్పుడు ఏ చేతులతో అయితే పోలీసులను వీరబాదుడు బాదిందో అదే చేతులతో హారతిస్తే వింత కాదంటారా? గతంలో పోలీసులు ఓ సందర్భంలో షర్మిలను హౌస్ అరెస్ట్ చేయడానికి వెళ్లారు. ఆమె లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారితో షర్మిల వాగ్వాదానికి దిగారు. అడ్డుకుంటున్న వారిని వీరనారిలా తోసేసి మరీ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు యత్నించారు. ఈక్రమంలోనే అడ్డొచ్చిన మహిళా కానిస్టేబుల్ చెంపపై చాచి కొట్టారు. ఆ తరువాత ఆమె కారును అడ్డుకున్న ఓ ఎస్సైపై కూడా చేయి చేసుకున్నారు. మీకు పని లేకుంటే వెళ్లి గాడిదలు కాసుకోండంటూ పోలీసులను అవహేళన చేశారు. తామిప్పుడు అదే పని చేస్తున్నామని సదరు పోలీస్ కౌంటర్ ఇచ్చారు.
ఇంత చేసిన షర్మిల నేడు గృహ నిర్బంధం చేయడానికి వెళ్లిన పోలీసులకు హారతులు ఇచ్చారు. ఈ సారి కూడా నిరసనే. అయితే అది శాంతియుతంగా. గజ్వేల్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా పోలీసులకు హారతి పట్టారు. అంతేకాదు.. సీఎం కేసీఆర్ తీరుకు నిరసనగా సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు షర్మిల ప్రకటించారు. దళితబంధు పథకం అమలు కావడం లేదని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిల ఆ నియోజకవర్గంలో పర్యటించాలని భావించారు. అయితే తమ నియోజకవర్గానికి షర్మిల వస్తే.. ఆమెను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఆమె వెళితే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని భావించిన పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు.