దేవరకు సంబంధించి ప్రతి చిన్న అప్ డేట్ కోసం గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. ఓ చిన్న షెడ్యూల్ అప్ డేట్ అయినా మరే మినిమల్ ఫాన్స్ లీకైనా సోషల్ మీడియాలో సర్రున వైరలయ్యిపోతుంది. అయితే సినిమా చిత్రీకరణ మొత్తం కామ్ గా సాగిస్తున్న టీమ్ కి కొన్ని అప్ డేట్స్ ఇవ్వడం మాత్రం తప్పడం లేదు. అప్పట్లో జాన్వీ కపూర్ కి బర్త్ డే విషెస్ చెబుతూ ఆమె లుక్ రివీల్ చేసినట్టుగానే.. ఈరోజు సినిమాలో ప్రధాన ప్రతినాయకుడైన సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే కావడంతో ఆయన చేస్తోన్న భైర కేరెక్టర్ లుక్ ని రివీల్ చేస్తూ పవర్ ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది దేవర టీమ్. సైఫ్ అలీ ఖాన్ కి దేవర టీమ్ బర్త్ డే విషెస్ చెప్పడం ఏమో కానీ.. దేవరకి సంబంధించి ఓ అప్ డేట్ రావడం పట్ల ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు అభిమానులు.
ఇక సైఫ్ అలీ ఖాన్ విషయానికొస్తే నార్త్ ఆడియన్స్ కి బాగా పరిచయమైన పేరు.. అతి త్వరలో దేవర తర్వాత మన ఆడియన్స్ కి కూడా బాగా గుర్తుండిపోయే పేరు కాబోతుంది సైఫ్ అలీ ఖాన్. ఎప్పుడో 20 ఏళ్ళ కిందే నట జీవితం మొదలు పెట్టి యే దిల్లగీ, మై ఖిలాడీ-తు అనారి, కచ్చే దాగే, హమ్ సాథ్ సాథ్ హై, దిల్ చాహతాహై, కల్ హో న హో వంటి మల్టీస్టారర్స్ లో నటిస్తూనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ 2004 లో వచ్చిన హమ్ తుమ్ సినిమాలో హీరోగా నటించి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఆ సినిమాలో అతను చూపించిన నటనా వైవిధ్యం మన మహేష్ బాబుని ఎంతగా ఆకట్టుకుందంటే.. అసలు రీమేకులే చెయ్యనని ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్పే మహేష్ ఆ హమ్ తుమ్ రీమేక్ విషయంలో మాత్రం చాలా ఉత్సాహం చూపించారు. అయితే అది జరగలేదు కానీ.. మళ్ళీ మరో విడత సైఫ్ కనబరిచిన అద్భుత అభినయం లవ్ ఆజ్ కల్ రూపంలో పవన్ కళ్యాణ్ కంట పడింది. రీమేకులకి రెడీగా ఉండే కళ్యాణ్ స్వభావం వల్ల అది తీన్ మార్ రూపంలో తెలుగులోకి దిగింది. అక్కడే అర్ధం చేసుకోవచ్చు నటుడిగా సైఫ్ స్థాయిని. ఆపై వచ్చిన సినిమాలు మనకి మరింత చూపించాయి అతని శక్తిని.
బాలీవుడ్ క్రేజీ సీరీస్ లో ఒకటైన రేస్ 1, రేస్ 2 రెండు పార్ట్శ్ లోను తనదైన గ్రేస్ చూపించి స్క్రీన్ పై చెడుగుడు ఆడేసాడు ఈ పవర్ ఫుల్ పటౌడీ. సలామ్ నమస్తే అంటూ తనలోని చక్కని చిలిపి దనాన్ని చూపించాడు. ఇక పాత సంగతులని పక్కనబెట్టేస్తే.. ఈమధ్య వచ్చిన ఆదిపురుష్ లో కూడా లంకేశ్ గా వంక పెట్టలేని అభినయమే ప్రదర్శించాడు కానీ సినిమా ఫలితం వల్ల తన కష్టానికి తగ్గ ప్రతి ఫలం దక్కలేదనుకోవాలి.
అదే సమయంలో అక్కున చేర్చుకున్నాడు దేవర.. అండగా నిలబడ్డాడు ఎన్టీఆర్. సైఫ్ స్థాయి నటనకి, తాను పడే కష్టానికి సరైన ఫలితం, సముచిత గుర్తింపు దేవరతో దక్కాలని ఆశిద్దాం.. ఆల్ ది బెస్ట్ చెబుదాం.