విక్టరీ వెంకటేష్‌తో ‘హిట్’ సిరీస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సైంధవ్’. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక చిత్రం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఇది విక్టరీ వెంకటేష్‌కి 75వ చిత్రం. వెంకీ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ పరుగులు పెట్టిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ విడుదల చేశారు.
సుమారు 16 రోజుల పాటు జరిగిన కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసినట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ షెడ్యూల్‌లో ఎనిమిది మంది ముఖ్య నటీనటులు షూట్‌లో పాల్గొనగా.. హై-ఆక్టేన్ ఎమోషనల్ క్లైమాక్స్‌ను హర్ష్ కండీషన్స్‌లో చిత్రీకరించినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ సూపర్ వైజ్ చేసినట్లుగా తెలుపుతూ.. వెంకటేష్‌కి ఇప్పటి వరకు ఇదే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ క్లైమాక్స్ పోర్షన్ అని.. చాలా అద్భుతంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ షెడ్యూల్ మాత్రమే కాదు.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ మొత్తంపై వెంకటేష్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ మైల్‌స్టోన్ మూవీ కోసం నిర్మాత ఖర్చు విషయంలో వెనుకాడటం లేదని.. ఎంత ఖర్చు అయినా సరే.. వెంకీకి, ఆయన ఫ్యాన్స్‌కి ఎప్పటికీ చెప్పుకునే చిత్రాన్ని తమ బ్యానర్ ఇవ్వాలనే ధ్యేయంతో ఉన్నారట. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా వంటి వారంతా ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.