మీ ప్రతాపం సినీ పరిశ్రమపై కాదు.. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులపై చూపండి.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారు, ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టండి, ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టండి, ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు, మా రెమ్యునరేషన్స్ వదిలేసి రాష్ట్రంలోని అభివృద్ధిపై దృష్టి పెట్టండి అంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాల్తేరు వీరయ్య 200 రోజుల ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో దుమ్ము దుమారాన్ని రేపుతున్నాయి.
ఇది కదా ఇండస్ట్రీ పెద్ద మాట్లాడాల్సిన మాటలంటూ సోషల్ మీడియాలో చిరు పై ప్రసంశలు కురుస్తుంటే.. ఏపీలోని వైసీపీ నేతలు మాత్రం మెగాస్టార్ పై విరుచుకుపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా మాట్లాడితే వెంటనే దిగిపోయే పేర్ని నాని గారు మెగాస్టార్ పై యుద్దానికి బయలు దేరారు. పేర్ని నాని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి.. చిరంజీవి రెమ్యునరేషన్ గురించి మేము అడిగామా.. అసలు రెమ్యునరేషన్ విషయం ఎందుకు వచ్చింది.. కథలో లేని విషయానికి ఒక నటుడి పాత్ర ప్రవేశ పెట్టి ఏపీలోని రాజకీయ నాయకుడిపై కక్ష తీర్చుకున్నారు.. కథకి సంబంధం లేని విషయాన్ని తీసుకుని దురద తీర్చుకుంటే మాట్లాడాల్సి వచ్చింది. ఫిలిం నగర్ నుండి ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఎంత దూరమో.. అమరావతి లోని సచివాలయానికి ఫిలిం నగర్ కి కూడా అంతే దూరం. అలాగే చిరంజీవి గారిని ఒకటే కోరుకుంటున్నాను, సినిమాని సినిమాగా చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. చిరంజీవి గారు, చరణ్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, చిరంజీవి గారి తమ్ముడు కొడుకులు, మేనల్లుళ్లు గురించి ఎప్పుడైనా మాట్లాడమా..
సినిమా వాళ్లంతా వేరు, ఏ రాజకీయకుడైనా చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, రవితేజ, ఏ డైరెక్టర్ గురించి అయినా, నిర్మాతలపైనా ఏమైనా ఎవరైనా మట్లాడారా.. ఏ హీరో రెమ్యునేషన్ గురించి ఎవరైనా అడిగారా.. అంటూ పేర్ని నాని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలకి కౌంటర్ ఎటాక్ చేసారు.