మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే పలు అంశాలకు నటుడు, కమెడియన్ హైపర్ ఆది.. ఆదివారం జరిగిన భోళా శంకర్ ప్రీ రిలీజ్ వేడుకలో క్లారిటీ ఇచ్చేశారు. మళ్లీ చిరంజీవిని ఏదైనా మాట అనాలంటే వణికిపోయేంతగా.. ఇంకా చెప్పాలంటే.. పవన్ కళ్యాణ్‌ని చూస్తే బండ్ల గణేష్ ఎలా అయితే మారిపోతారో.. అలా మెగాస్టార్‌ని చూడగానే ఆది అలా అయిపోయాడు. అసలు భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైపర్ ఆది స్పీచే హైలెట్ అంటే.. ఏ రేంజ్‌లో వాయించేశాడో అర్థం చేసుకోవచ్చు. అతని స్పీచ్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంతో ముచ్చటపడి.. ఓ డీప్ హగ్ కూడా ఇచ్చారు. అంతగా మెగా ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చాడు ఆది. హైపర్ ఆది స్పీచ్‌లో హైలెట్స్ ఏంటంటే..
కొన్ని విషయాలు మాట్లాడుకుంటేనే.. కొందరు మనల్ని ఏమీ అనకుండా ఉంటారు.. కాబట్టి మాట్లాడాలి అంటూ స్పీచ్ స్టార్ చేసిన ఆది..
* ఒక సాదారణ ఫ్యామిలీకి చెందిన యువకుడు ఒక సైనికుడిని అవుతానంటూ ఓ యుద్ధభూమికి బయలు దేరాడు. ఆ యుద్ధభూమిలో కండలు తిరిగిన సైనికులు చాలా మంది ఉన్నారు. వాళ్లు యుద్ధం చేస్తున్నారు.. గెలుస్తున్నారు.. ఈయన చూస్తున్నారు. ఒకరోజు ఈయనకి యుద్ధం చేసే అవకాశం వచ్చింది. వాళ్లందరి కళ్లు చెదిరేలా యుద్ధం చేస్తే.. అందరూ ఆయనని సైన్యాధిపతిగా ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమని 30 ఏళ్ళు సైన్యాధిపతిగా ఏలుతూనే ఉన్నారు. ఇక్కడ యుద్ధభూమి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ సైన్యాధిపతి మెగాస్టార్ చిరంజీవిగారు. అన్నయ్య ఇంతమంది సినీ సైనికుల్ని తయారు చేసి సినీ ఇంద్రసేనాని అయితే.. అక్కడ తమ్ముడేమో జనసైనికుల్ని తయారు చేసి జనసేనాని అయ్యారు.
* మాములుగా ఎవరిగురించి అయినా మాట్లాడేటప్పుడు.. మన మాటలు వినేవారికి గూజ్‌బంప్స్ వస్తాయి. కానీ మాట్లాడేవాడికి కూడా గూజ్‌బంప్స్ వస్తున్నాయంటే.. అది ఖచ్చితంగా మెగాస్టార్ గురించే అయి ఉంటుంది. బేసిగ్గా హీరోలకి ఫ్యాన్స్ వుంటారు. కానీ హీరోలే ఆయనకి ఫ్యాన్స్ గా వుంటారు. ఆస్థులు సంపాదించడం కన్నా.. అభిమానుల్ని సంపాదించడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకుని ఎదిగిన హీరో మెగాస్టార్. అటు పాత తరానికి, ఇటు కొత్త తరానికి మధ్య వారధి.. ఇన్ని కోట్లమంది అభిమానులకు సారధి మెగాస్టార్.
* ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో నేను చెప్పలేను కానీ.. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా మెగాస్టార్ ఫ్యాన్ అయితే ఉంటారు. ఇది షూర్. నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవిగారు, సచిన్ టెండూల్కర్‌గారు.. వీరిద్దరూ ఒకటే. సచిన్‌ని ఎవరైనా విమర్శిస్తే.. నోటితో సమాధానం చెప్పడు.. బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడు. అలాగే చిరంజీవిగారిని ఎవరైనా విమర్శించినా.. మాటలతో సమాధానం చెప్పరు.. మళ్లీ సినిమాతో సమాధానం చెబుతారు. ఆచార్య సినిమాకు విమర్శలొచ్చాయ్.. వాల్తేరు వీరయ్యతో వారందరికీ సమాధానాలొచ్చాయ్. అది మెగాస్టార్.
* ఈ జనరేషన్ హీరోలందరూ డ్యాన్స్ ఇరగదీస్తారు.. కానీ ఆ డ్యాన్స్‌లో ఓ మార్క్‌ని సెట్ చేసింది మెగాస్టార్. ఈ జనరేషన్ హీరోలందరూ ఫైట్స్ కుమ్మేస్తారు.. కానీ అందులో ఓ మార్క్‌ని సెట్ చేసింది మెగాస్టార్. ఈ జనరేషన్ హీరోలందరికీ రెమ్యూనరేషన్స్ ఎక్కువ.. కానీ అందులో కూడా మార్క్‌ని సెట్ చేసింది మెగాస్టారే. ఒక్కసారి వెనక్కి వెళ్లి.. కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్న తొలి ఇండియన్ యాక్టర్ ఎవరని సెర్చ్ చేసి చూడండి.. మెగాస్టార్ అనే వస్తుంది. బిగ్గర్ దెన్ బచ్చన్ అని పెద్ద మ్యాగ్‌జైనే ఉంటుంది.. వెళ్లి చదువుకోండి. ఫస్ట్ రూ. 10 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ అని వెతికితే.. ఘరానా మొగుడు అని గూగుల్ కాదు.. ఎక్కడ వెతికినా వచ్చేస్తుంది. ఇక్కడున్న చాలా మందికి ఊహ తెలియక ముందే.. ఊహించని రికార్డ్స్ క్రియేట్ చేసిన స్టార్ మెగాస్టార్.