బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పేరుకి పరిచయం అక్కరలేదు. ఒకప్పుడు హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్థానంలో కొనసాగిన సంజూ భాయ్.. ఆ తర్వాత మున్నా భాయ్‌గా సరికొత్త స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు. ఎంత స్టార్‌డమ్ వచ్చిందో.. అంతే స్థాయిలో ఆయనపై వివాదం నెలకొంది. జైలు, క్యాన్సర్.. ఇలా జీవితంలో అనుభవించాల్సిన వన్నీ అనుభవించేసిన ఈ ఖల్ నాయక్‌కి ఇప్పుడు మరోసారి టైమ్ వచ్చేసింది. అవును ఖల్ నాయక్ టైమ్ ఆగయా..
బాలీవుడ్ సంగతి పక్కన పెడితే.. కన్నడలో ఆయన చేసిన ‘కెజియఫ్ 2’ సినిమా ఈ ఖల్ నాయక్‌పై అందరి కళ్లు పడేలా చేసింది. ఇప్పుడాయన చేతిలో.. ముఖ్యంగా సౌత్‌లో దాదాపు నాలుగైదు సినిమాలు ఉన్నాయంటే.. ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కబోతోన్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కూడా సంజయ్ దత్ నటించబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఇందులో ఆయన బిగ్ బుల్‌గా కనిపించబోతున్నాడని తెలుపుతూ.. ఓ లుక్ కూడా వదిలారు. ఇది కాకుండా విజయ్, లోకేష్ కనగరాజు దర్శకత్వంలో రాబోతోన్న ‘లియో’ సినిమాలో కూడా ఆయనే విలన్.
ఇంకా ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకుంటోన్న ‘రాజా డీలక్స్’ (ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు) చిత్రంలోనూ సంజయ్ దత్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇవి కాకుండా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న చిత్రంలో కూడా సంజయ్ దత్‌ని విలన్‌గా తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఆకారం విలనిజంకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుండటంతో భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఈ ఖల్ నాయక్‌ని బుక్ చేస్తున్నారు సౌత్ మేకర్స్.