ఏ ముహూర్తాన అజ్ఞాతవాసితో మొదలైందో కానీ.. ఎదురు దెబ్బల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎంత పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్నో రికార్డులు కొట్టేసే ఛాన్స్ దక్కినప్పటికీ.. వకీల్ సాబ్ పై కోవిడ్ కాటు పడింది. భీమ్లా నాయక్ విషయానికి వచ్చేసరికి ఏపీ గవర్నమెంట్ వేటు వేసింది. వీటి ప్రభావం ఆ రెండు సినిమాల కలెక్షన్స్ పై ఎంతగా పడింది అనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 30 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది అని పవన్ కల్యాణే స్వయంగా అంగీకరించారు.
ఇక ఇప్పటి విషయానికి వస్తే మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి తొలిసారి నటిస్తూ తెరపై చాలా ఉత్సాహాన్ని చూపించారు పవన్ కళ్యాణ్. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల రీత్యా ఈసారి పెద్దగా అడ్డంకులు, అవరోధాలు కూడా ఏవి ఎదురు కాలేదు. ఇంకేముంది ఘనంగా విడుదల సాధ్యం, అఖండ విజయం తథ్యం అని అభిమానులు ఆనంద పడుతున్న తరుణంలో అనూహ్యంగా వచ్చి పడింది. ఎడతెరిపి లేని వాన. గత రెండు మూడు రోజులుగా.. రెండు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాల్లో మునిగి తడిచి ముద్దవుతున్నాయి. ఆ ఇంపాక్ట్ బ్రో అడ్వాన్స్ బుకింగ్స్ పై స్పష్టంగా కనిపిస్తోంది. కింగ్ అఫ్ ఓపెనింగ్స్ అనిపించుకునే పవన్ కళ్యాణ్ కే ఈ పరిస్థితి ఉందంటే వర్షాల తీవ్రత ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఓవర్సీస్ వరకు ప్రీమియర్స్ కి మంచి నెంబర్లు రిజిస్టర్ అవుతున్నాయి. ఆపై ఏంటన్నది సినిమా టాక్ పై డిపెండై ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ కంచు కోట హైదరాబాద్ సిటీ థియేటర్స్ వెలవెలబోతూ ఫాన్స్ ని నివ్వెరపరుస్తున్నాయి. అటు RTC క్రాస్ రోడ్స్ లోనే కాక ఇటు బంజారాహిల్స్ RK సినీమ్యాక్స్ వంటి థియేటర్స్ లో కూడా అక్యుపెన్సీలు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అంతా సవ్యంగా ఉందనుకుంటే అనుకోకుండా తగిలిన ఈ వరుణుడి దెబ్బని పవనుడు తట్టుకోగలడా.. తన మేనల్లుడుకి మెమొరబుల్ హిట్ ఇస్తాడా.. మరికొన్ని గంటల్లో తేలిపోద్ది.. తెలిసిపోద్ది.