తనకి అసలు హీరో అవ్వాలని లేదు.. ఏదో వ్యవసాయం చేసుకుంటూ చిన్న జీవితం గడువుదామని కోరుకునేవాడిని.. కానీ ఈరోజు ఇలా మీముందు ఉండడానికి కారణం మా వదిన అంటూ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు. తాను హీరో అంటే తన ఊహల్లో చిరంజీవి గారే ఉంటారని, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ గార్లు పెద్ద హీరోలు.. అలా తనకి హీరో అవ్వాలంటే భయం, బిడియం, మొహమాటం, నలుగురిలో మాట్లాడాలన్నా సిగ్గు కానీ ఈరోజు ఇలా మీ ముందు స్టార్ గా నించున్నాను అంటే దానికి కారణం మా వదిన సురేఖ గారే. సినిమాల్లోకి వెళ్లాలని, హీరో అవ్వాలని ఎగదోసింది ఆవిడే అంటూ పవన్ కళ్యాణ్ మరోసారి బ్రో ఈవెంట్ లో వదిన సురేఖ గురించి చెప్పారు.
బ్రో ఈవెంట్ లో తాను హీరో ఎలా అయ్యాడో మరోసారి చెప్పుకొచ్చారు. సుస్వాగతం సినిమా అప్పుడు వైజాగ్ జగదాంబ జుంక్షన్ లో డబుల్ డెక్కర్ బస్సుపై డాన్స్ చేయించారు. ఆ డాన్స్ చేసిన రోజు నేను చచ్చిపోయాను. నలుగురిలో కలవలేను, మాట్లాడలేను, అందుకే మా వదినకు ఫోన్ చేసి నువ్వు నాకు ద్రోహం చేసావ్, హీరో అవ్వమని ఎగదోశావ్ అన్నాను. మా వదిన గారు చేసిన ద్రోహం వల్లే నేను మీ ముందు నించున్నాను లేదంటే మారుమూల ఎక్కడో వ్యవసాయం చేసుకుంటూ రైతుగా బ్రతికే వాడిని. నాకు అసలు హీరో అవ్వాలని లేనే లేదు.
కానీ హీరో అయ్యాను. నా ప్రపంచం చాలా చిన్నది అంటూ పవన్ కళ్యాణ్ బ్రో ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్ హైలెట్ అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నంతసేపు ఆయన అభిమానులు సీఎం.. సీఎం.. అంటూ అరుస్తూనే ఉన్నారు. దానితో పవన్ రాజకీయాలు అక్కడ వదిలేద్దాం, సినిమాలు గురించి మాట్లాడుకుందాం అంటూ ఫన్నీగా చెప్పారు.