ఓకె టైటిల్ తో రెండు భాషల్లో ఏం ఖర్మ చాలాసార్లు ఒకే భాషలో ఒకే టైటిల్ తో రెండు సినిమాలు తెరకెక్కిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కడివరకో ఎందుకు రాజశేఖర్ కల్కి టైటిల్ తో సినిమా చేసారు. ఇప్పుడు ప్రభాస్ ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అంటూ కల్కి తోనే రాబోతున్నారు. ఇప్పుడు రెండు భాషల్లో ఒకే టైటిల్ తో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం యాదృశ్చికమే అయినా, వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నా.. మధ్యలో మేకర్స్ ఎంతగా టెన్షన్ పడుతుంటారో ఆలోచించాలి. ఇప్పుడసలే ప్యాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. ఇలాంటి సమయంలో రెండు భాషల్లో ఒకే టైటిల్ తో సినిమాలు ఒకే తేదికి విడుదలవడం నిజంగా ప్రేక్షకులని కన్ఫ్యూజన్ లోకి నెట్టడమే.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేసిన మల్టీస్టారర్ ఫిల్మ్ జైలర్ ఆగష్టు 10న విడుదలకాబోతున్న విషయం తెలిసిందే. తమన్నా, మోహన్ లాన్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ జైలర్ హడావిడి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఈ చిత్రం తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం లో ప్యాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది. అదే ఆగష్టు 10 న మలయాళంలోనూ జైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే అది రజినీ జైలర్ కాదు.
ధ్యాన్ శ్రీనివాసన్ అనే మాలీవుడ్ యాక్టర్ చేసిన జైలర్. ఈ రెండు సినిమాలకు కథ విషయంలో ఎలాంటి పోలిక లేనప్పటికీ.. ఒకే టైటిల్ కామన్ ఆడియన్స్‌ను కన్‌ఫ్యూజ్ చేస్తుందని ఎప్పుడో మలయాళ మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. తమది చిన్న సినిమా అని.. టైటిల్ మారిస్తే ఆ ప్రభావం సినిమా మీద పడుతుందనేది మలయాళ జైలర్ మేకర్స్ అభిప్రాయం. కానీ రజిని జైలర్ మేకర్స్ కూడా ఆగష్టు 10 నుండి వెనక్కి తగ్గకపోవడంతో రెండు జైలర్ లు ఆగస్టు 10నే విడుదలకాబోతున్నాయి.