బాహుబలి, భళ్లాలదేవ మరోసారి కలిసి కనిపించారు. బాహుబలి సినిమాలో వారిద్దరి అభినయం వారిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ విషయం పరంగా ప్రభాస్ కంటే కూడా రానాకే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ ప్రోగ్రామ్స్‌కి సైతం రానా హోస్ట్‌గా వ్యవహరించి ఉన్నారు. అందుకే కాస్త తోడుగా ఉంటాడని.. రానాని కూడా యుఎస్‌కి పట్టుకెళ్లిపోయాడు ప్రభాస్. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో రకాలుగా వార్తలలో ఉంటోంది. శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించబోతోంది. ఈ వేడుక నిమిత్తం ప్రభాస్ ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. ప్రభాస్‌తో పాటు రానా దగ్గుబాటి కూడా ఉన్న పిక్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
బాహు, భళ్లాల సంగతి ఇలా ఉంటే.. ఇదే వేడుక కోసం విక్రమ్ కూడా చేరుకున్నాడు. విక్రమ్ అంటే అర్థం కాలేదా.. కమల్ హాసన్. ప్రాజెక్ట్ K చిత్రంలో కమల్ హాసన్ విలన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆ పాత్రకి ఆయన భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు విడుదలకు ముందే చరిత్ర సృష్టించబోతున్న కార్యక్రమానికి కమల్ హాసన్ కూడా హాజరవుతున్నారు. కమల్ హాసన్ ఇప్పటికే అమెరికా చేరుకోగా.. అక్కడి వీధుల్లో ఆయన ఒంటరిగా తిరుగుతున్న ఫొటోని కూడా మేకర్స్ విడుదల చేశారు. దీంతో ప్రాజెక్ట్ కె ట్రెండ్ అవుతూనే ఉంది.
అమెరికాలో జరిగే శాన్ డియాగో కామిక్-కాన్ 2023 వేడుకకు ప్రభాస్, కమల్ హాసన్‌తో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్, దీపికా పదుకొణె, బిగ్ బి వంటి వారు కూడా హాజరవుతారని తెలుస్తోంది. ఈ వేడుక జూలై 20వ తేదీని ప్రారంభమవుతుంది. భారత్ కాలమాన ప్రకారం జూలై 21న ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలుస్తాయి. ఈ వేడుకలో ఈ సైన్స్ ఫిక్షన్ చిత్ర క్రియేటర్స్ టైటిల్, గ్లింప్స్‌ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే అదే వేదికగా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించనున్నారు.