చాలామంది మిడిల్ క్లాస్, లో క్లాస్ ఫామిలీస్ తమలా తమ పిల్లలు కష్టపడకూడదు అని ఎన్ని కష్టలు ఎదురైనా పిల్లలని బాగా చదించాలని తాపత్రయపడుతుంటారు. రెండుపూటలా కడుపునిండా భోజనము చేస్తే చాలు ఈ చదువు కూడు పెడుతుందా అనే వాళ్ళు లేకపోలేదు. కానీ చాలామంది పిల్లలు చదువుకుని బాగుపడాలని తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తారు. అయితే తమిళనాడులో ఇప్పుడొక సంఘటన ప్రతి కంట కన్నీరు పెట్టిస్తుంది. కన్న పిల్లల చదువు కోసం ఓ తల్లి అర్ధాంతరంగా ప్రాణాలు వదలడం అందరిని బాధించింది. తాను చనిపోతే దాని ద్వారా ప్రభుత్వం తన కొడుకు చదువు సహాయం చేస్తుంది అని నమ్మి తన ప్రాణాలని త్యాగం చేసింది ఆమె.
తమిళనాడుకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఓ కాంట్రాక్టరు దగ్గర పని చేస్తూ నెలకి పది వేలు సంపాదిస్తుంది. ఆ పది వేలతోనే ఇద్దరి పిల్లలని, ఆమె తల్లిని పోషిస్తూ పిల్లలని చదివించుకుంటుంది. ఆ మహిళ కొడుకు ఇంజినీరింగ్ మూడో సంవత్సరం, కుమార్తె పాలిటెక్నీక్ మొదటి ఏడాది చదువుతుండగా.. కాలేజీ ఫీజులు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చెయ్యడంతో ఏం చెయ్యాలో తోచని ఆ తల్లి తాను మరణిస్తే తన పిల్లల చదువుకి ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేస్తుంది అనుకుంది.
అనుకున్నదే తడవుగా.. రోడ్డు పక్కనే నడిచి వెళుతున్న ఆమె ఉన్నట్టుండి రోడ్డు మధ్యగా వచ్చి ఎదురుగా వస్తున్న బస్సు ని గుద్దెయ్యడమో.. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన ఘటన హృదయవిదారకంగా మారింది. పిల్లల ఫీజులు 45000 వేలు చెల్లించాల్సిన ఆ మహిళ తన దగ్గర డబ్బు లేకపోవడంతో మధనపడిపోయింది. అయితే ఆమె చనిపోతే ప్రభుత్వ సహాయం అందుతుంది, పిల్లలు చదువుకుంటారనే కొంతమంది మాటలు పట్టుకుని ఆమె ఇలా ప్రాణ త్యాగం చేసింది. ప్రస్తుతం తమిళనాట సేలం లో జరిగిన ఈఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటన ప్రతి వారిని కంట తడి పెట్టిస్తుంది.