దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ సినిమా బాక్సాఫీస్‌పై అలాంటి ప్రభావాన్ని చూపించింది మరి. సినిమా విడుదలైన అన్ని చోట్లా జనాలు నీరాజనాలు పలికారు. సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డ్‌ని సైతం అందుకుని.. సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఇప్పుడిక ఆర్ఆర్ఆర్2 వంతొచ్చింది.
ఈ ఆర్ఆర్ఆర్2 గురించి ఇంకా ఏమీ కార్యరూపం దాల్చకుండానే.. ఒకే ఒక్కమాటతో ఆ పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఆ ఒక్కమాట ఏమిటంటే.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుంది.. అందులో చరణ్, ఎన్టీఆర్ నటిస్తారు.. కానీ దర్శకుడు మాత్రం రాజమౌళి కాదు అనేలా ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ చిత్రాల రచయిత, దర్శకధీరుడి తండ్రి విజయేంద్రప్రసాద్ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెప్పిన ఈ ఒకే ఒక్క మాటతో.. ఇప్పుడంతా ఒకటే చర్చలు. రాజమౌళి కాకుండా ఆర్ఆర్ఆర్2ని నడిపించే సమర్థవంతమైన నాయకుడెవరు? నిజంగా ఇది జరిగే విషయమేనా? అంటూ చర్చలు నడుస్తున్నాయి.
ఈ చర్చల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘ఆర్ఆర్ఆర్2’ని నడిపించగల నాయకుడు మరెవరో కాదు.. రాజమౌళి తనయుడు కార్తికేయ అనేలా టాక్ నడుస్తోంది. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ రెండవ యూనిట్‌కి కార్తికేయనే దర్శకుడు. ఆ విషయం అప్పట్లోనే రివీలైంది. అలాగే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొట్టడానికి కారణం కూడా కార్తికేయనే. ఆర్ఆర్ఆర్ అన్ని దేశాల్లో విడుదల కావడానికి, సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపురావడానికి కారణం కూడా అతనే. అందుకే ఆర్ఆర్ఆర్‌లోని అన్ని కోణాలు కార్తికేయకు తెలుసు కాబట్టి, పక్కన తండ్రి సలహాలు ఎలాగూ ఇస్తుంటాడు కాబట్టి.. అతని దర్శకత్వంలోనే ఆర్ఆర్ఆర్2 తెరకెక్కనుందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో?