జాన్వీ కపూర్ సౌత్‌ని చుట్టెయ్యడానికి రంగం సిద్దమైనట్లుగా తెలుస్తుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ సినిమాలతో పాపులర్ కాకపోయినా.. ఆమె సోషల్ మీడియా అందాలు ఆమెని పాపులారిటికి దగ్గర చేశాయి. శ్రీదేవి డాటర్ అనే బ్రాండ్ ఆమెని సౌత్‌లోకి వచ్చేలా చేశాయి. అందులోనూ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన ఆమెకి మొదటి సౌత్ సినిమా ఆఫర్ రావడం ఆమె లక్కీనే అనే కంటే.. ఆమె శ్రీదేవి డాటర్ అంటే కరెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ ఎన్టీఆర్ దేవరతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ ఆ సినిమాతో ప్యాన్ ఇండియా ప్రేక్షకులని పలకరించబోతుంది.
ఈలోపులో జాన్వీ కపూర్ తమిళనాట అడుగులు వేసేందుకు రెడీ అయ్యింది అనే వార్త గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇంతకుముందు జాన్వీ కపూర్ తమిళ ఎంట్రీపై వార్తలొచ్చినా వాటిని బోనీ కపూర్ కొట్టిపారేశారు. అయితే తాజాగా జాన్వీ కపూర్ లవ్ టుడే తో హిట్ కొట్టిన దర్శకుడు కమ్ హీరో ప్రదీప్ రంగనాధన్‌తో కోలీవుడ్‌లో ఓ లవ్ స్టోరీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే న్యూస్ మొదలైంది.
ఈ చిత్రానికికి విఘ్నేష్ శివన్ (నయనతార భర్త) దర్శకత్వం వహిస్తున్నారట. విగ్నేష్ శివనే స్వయంగా వెళ్లి ఈ మూవీ కోసం జాన్వీ కపూర్‌తో మాట్లాడాడని తెలుస్తోంది. దీంతో జాన్వీ వెంటనే ఒకే చెప్పినట్లుగా టాక్ మొదలయ్యింది. ఈ సినిమాని యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్ బ్యానర్‌పై నిర్మించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో నయనతార కూడా ఓ కీ రోల్ పోషించనుందనేలా టాక్ వినబడుతోంది.