సీనియర్ నటుడు నరేష్ గత కొంతకాలంగా పర్సనల్ లైఫ్ విషయంలో తరుచూ మీడియాలో నానుతున్నారు. విజయ నిర్మల పోయాక నరేష్-పవిత్ర లోకేష్ ల వ్యవహారం బాగా హైలెట్ అయ్యింది. నరేష్ మూడో భార్య రమ్యరఘుపతితో గొడవలు, పవిత్ర లోకేష్ తో సహజీవనం అంటూ నరేష్ హడావిడిగానే కనబడుతున్నారు. ఈమధ్యనే మళ్ళీ పెళ్లి అంటూ తనది-పవిత్ర లోకేష్ ల వ్యవహారాన్ని బహిర్గతం చేసారు. అయితే తన మూడో భార్య రమ్య రఘుపతి వలన తనకి ప్రాణ హాని ఉంది అంటూ గతంలోనే నరేష్ పోలీస్ ఫిర్యాదు చేసారు.
తన ఇంటి ముందు కొంతమంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారంటూ ఆయన కంప్లైంట్ లో రాసారు. అయితే తాజాగా నరేష్ తుపాకి లైసెన్స్ కోసం అనుమతి కోరుతూ ఎస్పీని కలిశారు. తనకి కొంతమంది నుండి ప్రాణహాని ఉందని, రక్షణ కోసం తనకి లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీని మాధవరెడ్డిని కోరారు. గతంలో మావోయిస్టుల నుంచి తనకు ప్రాణహాని ఉండడంతో 2008లో లైసెన్స్ రివాల్వర్ తీసుకున్నట్టు చెప్పారు.
ఆ తర్వాత దానికి అనుమతి ఇవ్వాలని గతంలో కోరినా ఇవ్వలేదని, కానీ ఇప్పుడు హిందూపురంలో ఉంటున్న తనకు లైసెన్స్ రివాల్వర్‌ను తన వద్ద ఉంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన ఎస్పీని కోరినట్టుగా తెలిపారు.