ఊరించి, ఉడికించి ఎట్టకేలకు బయటికొచ్చిన బ్రో టీజర్ ఎత్తి కుదేసింది. సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్స్ తో పవన్ స్వాగ్ ఎలివేట్ చేసిన స్టయిల్ పవర్ స్టార్ ఫాన్స్ కి పిచ్చ కిక్కిస్తుంది. మామ అల్లుళ్ళ కెమిస్ట్రీ మాంచి ఎంటర్టైన్మెంట్ కి గ్యారెంటీ ఇస్తోంది. ఒకవైపు విజువల్స్ ఇంప్రెస్స్ చేస్తుంటే.. మరోవైపు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆ ఇంపాక్ట్ ని డబుల్ చేస్తోంది. ఇంతకీ ఈ టీజర్ ఎలా ఉందంటే..
చీకటిలో చిక్కుకొని ఒకరి సహాయం కోరుతున్న సాయి ధరమ్ తేజ్ వాయిస్‌తో టీజర్ మొదలవుతుంది. అతను వారిని 'మాస్టర్', 'గురు', 'తమ్ముడు' అని రకరకాలుగా సంబోధిస్తాడు. చివరకు 'బ్రో' అని పిలుస్తాడు. ఇక్కడ పవర్ లేదా అనడిగే పిలుపు , పెద్ద ఉరుముతో పవన్ కళ్యాణ్ రాకకు స్వాగతం పలుకుతుంది. 'తమ్ముడు' సహా తన ఇతర హిట్ చిత్రాలను గుర్తు చేస్తూ, టీ గ్లాస్ పట్టుకుని, పవర్ స్టార్ అనేక రకాల లుక్స్ లో కనిపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఓం లాకెట్ ధరించి, మనోహరమైన చిరునవ్వుతో కనిపించారు. ఆ తర్వాత కూలీ దుస్తులు ధరించి 'కాలం మీకు అంతు పట్టని మాయాజాలం' అంటూ సాయి ధరమ్ తేజ్ ముందుకు వచ్చారు. అమాయకంగా కనిపించే సాయి ధరమ్ తేజ్‌తో ఆయన అల్లరి చేస్తూ సరదాగా ఆడుకుంటారు. గిటార్ పట్టుకుని పార్టీలో డ్యాన్స్ చేయడం నుండి స్టార్‌ల మధ్య హాస్య సంభాషణల వరకు అభిమానుల చేత విజిల్ వేయించే అద్భుతమైన మూమెంట్స్ టీజర్ లో ఎన్నో ఉన్నాయి.
'సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వు' అంటూ కారులో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ని ముగించిన తీరు బాగుంది. సినిమాలో వినోదానికి కొదవ లేదనే విషయాన్ని ఇది సూచిస్తుంది. ప్రధాన అంశాన్ని రివీల్ చేయకుండానే, టీజర్ ని ఎంతో ఆకర్షణీయంగా రూపొందించారు.
ఎస్.ఎస్ థమన్ ఆకట్టుకునే నేపథ్య సంగీతం, అందమైన విజువల్స్ మరియు పవన్ కళ్యాణ్ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో.. జూలైలో వెండితెరపై విందు ఖాయమనే నమ్మకాన్ని కలిగిస్తుంది టీజర్. ఇందులో టైటిల్ పాత్రధారి 'బ్రో'గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, మార్క్ Aka మార్కండేయులుగా సాయి ధరమ్ నటిస్తున్నారు.