అంబేద్కర్ కోనసీమ జిలాల్లో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ ఆత్మహత్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. శ్యామ్ మణికంఠది ఆత్మహత్య కాదు అంటూ ఆయన కుటుంబమే కాకుండా.. టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో శ్యామ్ మణికంఠ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా.. అది ఆత్మహత్యగా తేల్చేసారు పోలీసులు. అయితే ఈనెల 25 న సూయిసైడ్ చేసుకున్న శ్యామ్ ఒంటిపై అనుమానాలకు తావిచ్చేలా గాయాలు ఉండడంతో ఇప్పుడు శ్యామ్ కి న్యాయం జరగాలంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు శ్యామ్ ఒక్కడే ఆ కుటుంబానికి ఆధారం అని, అతని మరణంతో కుటుంబం ఒంటరిగా మిగిలిపోయింది.. అందుకే శ్యామ్ చెల్లి పెళ్లి బాధ్యతలు తాము తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ తన అభిమాని శ్యామ్ మృతిపై రియాక్ట్ అయ్యారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో, ఎలా చనిపోయాడో తెలియకపోవడం మనసుని కలిచి వేస్తుంది..
ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి శ్యామ్ మృతిపై దర్యాప్తు చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.