డ్రగ్స్ నేపథ్యంలో సినిమాలని తెరకెక్కిస్తూ బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొడుతూ తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్ కి తమిళనాట కాదు.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఖైదీ, విక్రమ్ లాంటి చిత్రాలు అతన్ని స్టార్ డైరెక్టర్ గా మార్చేశాయి. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డిమాండ్ తమిళనాట బాగా ఉంది. తెలుగు హీరోలు కూడా లోకేష్ కనగరాజ్ తో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నారు. విక్రమ్ తో ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన లోకేష్ కనగరాజ్ ప్రెజెంట్ విజయ్-త్రిషలతో LEO మూవీ చేస్తున్నాడు.
తదుపరి ఆయన చెయ్యాల్సిన ఖైదీ 2, విక్రమ్ సీక్వెల్ ఇలా చాలా పెండింగ్ లోనే ఉన్నాయి. అయితే లోకేష్ కనగరాజ్ తాజాగా ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ఫాన్స్ ని కలవరపరుస్తోంది. తాను ఎక్కువ సినిమాలు తీయాలని సినిమా ఇండస్ట్రీకి రాలేదని, ఒక పది సినిమాలు చేసాక రిటైర్ అయిపోతానని చెప్పిన లోకేష్ మాటలతో ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. అసలు లోకేష్ నిర్ణయాన్ని వాళ్ళు ఒప్పుకోవడమే లేదు. అయితే లోకేష్ కనగరాజ్ ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ లెక్కించి ఇకపై చెయ్యబోయే సినిమాలతో కలిపి పది చేసి తప్పుకుంటాడా.. లేదంటే LEO తో కలిపి ఇంకా తొమ్మిది సినిమాలు చేసి రిటైర్ అవుతాడా అనేది అభిమానుల్లో గందరగోళం క్రియేట్ చేసింది.
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యునివర్స్ కాన్సెప్ట్ లో భాగంగా తాను తీసిన కథల్లోని హీరోలందరినీ ఒక చోట కలుపుతానని, అవెంజర్స్ లాగా వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచేలా చేస్తానని అంటున్నాడు. కాకపోతే తన ఆలోచనకి హీరోలు, నిర్మాతలు తమకి ఎలాంటి అభ్యంతరం లేదని ఒప్పుకుంటే తప్ప అది సాధ్యపడదని చెబుతున్నాడు. మరి లోకేష్ కనగరాజ్ పది సినిమాల తర్వాత రిటైర్మెంట్ నిర్ణయంపై ఆయన ఫాన్స్ మాత్రం చాలా ఆందోళనపడుతున్నారు.. ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీకి దూరమైతే మంచి సినిమాలు మిస్ అవుతామనేది వాళ్ళ బాధ.