OG షూట్ నుండి చిన్న బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలపై దృష్టి సారించారు. నిన్న సాయంత్రమే ఆయన హైదరాబాద్ నుండి విజయవాడ ఫ్లైట్ లో వెళ్లి అక్కడి నుండి రోడ్డుమార్గాన మంగళగిరి చేరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతారు. చాతుర్మాస దీక్ష చేపడుతూ ఉంటారు. రేపు 14 న పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఆ సందర్భంగానే పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ యాగాన్ని నిర్వహిస్తున్నారు.
సోమవారం ఉదయం 6.55 నిమిషాలకు ఆయన తలపెట్టిన యాగానికి గణపతి పూజతో స్వయంగా పవన్ కళ్యాణ్ అంకురార్పణ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధారణలో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు.
యాగం జరుగుతున్న ప్రాంతమంతా మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లుల అలంకరణతో శోభాయమానంగా అలరారుతోంది. పవన్ కళ్యాణ్ ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు చేతుల మీదుగా సంప్రదాయబద్దంగా ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు.