ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకుని మొదలెట్టిన చిత్రం ‘దేవర’. మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘ఆచార్య’ తర్వాత దర్శకుడు కొరటాల కూడా చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా స్టార్ట్ చేశారు. షూటింగ్ ప్రారంభమవడం ఆలస్యమై ఉండవచ్చు కానీ.. సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత మాత్రం ఎన్టీఆర్ సహకారంతో కొరటాల ఈ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. అవుట్‌పుట్ అద్భుతంగా వస్తుండటంతో టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు.
ఇక ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందనేలా వార్తలు వచ్చిన క్రమంలో.. తనకెంతో ఇష్టమైన హీరో సినిమాతో ఎట్టకేలకు టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఇందులో ఆమె మత్స్యకారుల కుటుంబానికి చెందిన అమ్మాయిగా నటిస్తోందనేలా ఇప్పటికే టాక్ బయటికి వచ్చింది. కానీ ఆమె పాత్రకు సంబంధించి ఇప్పుడు మరో వార్త.. టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇందులో ఆమె ‘రా’ ఏజెంట్‌గా పనిచేస్తుందట.
ఆమె పాత్ర మత్స్యకారుల కుటుంబానికి చెందినదిగా మొదలై.. చివరికి ‘దేవర’ను పట్టుకోవడానికి వచ్చిన ‘రా’ ఏజెంట్‌గా రివీలవుతుందని అంటున్నారు. మధ్యలో ‘దేవర’కు సంబంధించిన సమాచారాన్ని తన పై అధికారులకు అందించే సీన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయనేలా టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ.. ఆమె పాత్రకి ఉన్న వేరియేషన్స్ నచ్చడం వల్లే.. ఇందులో జాన్వీ నటించేందుకు వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.