అనుకోని రైలు ప్రమాదం కొన్నివందలమంది గుండెల్లో గుబులు రేపింది. పట్టాలపై పరుగులు తీయాల్సిన హౌరా-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే బెంగలూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు కోరమండల్‌ను ఢీకొట్టింది. కొద్దినిమిషాల వ్యవధిలోనే ఈ ప్రమాదాలు జరగడం అత్యంత బాధాకరమైన విషయం. వందల సంఖ్యలో మరణాలు, క్షతగాత్రుల హాహాకారాలతో ప్రమాద స్థలం భీతావహంగా మారింది.
మృతులు, క్షతగాత్రులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. నిన్న సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. రైలు భోగీల్లోనే పలుమంది క్షతగాత్రులు, పలు మృతదేహాలు ఇరుక్కుపోవడంతో వాటిని బయటికి తీసేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే 280 మందికి పైగా ఈ రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు వదిలినట్టుగా ప్రాధమిక సమాచారం అందుతుంది. 900 మందికి పైగా గాయపడినట్లుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది అంటున్నారు.
రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రైల్వే సఖ మృతులకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50వేలు పరిహారంగా ప్రకటించారు.
ఈ ఘోర ట్రైన్ యాక్సిడెంట్ కి పలువురు సెలబ్రిటీస్ సంతాపం తెలుపుతున్నారు. శుక్రవారం రాత్రి ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత ప్రయాణీకులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.
మెగాస్టార్ చిరు, ఎన్టీఆర్, ఇంకా పలువురు ప్రముఖులు, రాజకీయనేతలు ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.