అహ్మదాబాద్ వెళ్లి ఐపీఎల్ కప్ గెలిచిన చెన్నై టీమ్ లాగా బాలీవుడ్ కి వెళ్లి భారీ హిట్టు కొట్టేద్దాం అనుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి అపజయం ఎదురైంది.. ఆశ ఆవిరైంది. అందుకే మళ్ళీ హోమ్ గ్రౌండ్ కి వచ్చేసాడు. టాలీవుడ్ లో తన తాజా చిత్రం మొదలు పెట్టేసాడు.
ఛత్రపతి హిందీ రీమేక్ కోసం ఎంతో కష్టపడినా, మరెంతో ఖర్చు పెట్టినా ఫైనల్ గా దారుణమైన రిజల్ట్ రావడం బెల్లంకొండ శ్రీనివాస్ ని రియాలిటీలోకి పట్టుకొచ్చింది. యూట్యూబ్ లో వ్యూస్ రావడం వేరు - నార్త్ జనాన్ని థియేటర్లకు రప్పించడం వేరు అనేది అర్ధం అవగానే ఆలస్యం చేయకుండా తిరిగొచ్చేసి మళ్ళీ తెలుగునాట వాలిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ చేసి సూపర్ సక్సెస్ సాధించిన సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ చేయనున్న చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, పరశురామ్ ఈ ఈవెంట్ కి అటెండై టీమ్ కి అల్ ది బెస్ట్ చెప్పారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ఫస్ట్ షాట్ కి హరీష్ శంకర్ క్లాప్ ఇవ్వగా.. పరశురామ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట - గోపీ ఆచంట నిర్మిస్తోన్న ఈ చిత్రం స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనుందని... యునిక్ సబ్జెక్ట్ తో, భారీ బడ్జెట్ తో తీస్తోన్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేస్తామని చెప్పారు మేకర్స్.
ధమాకా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తారని, హీరోయిన్ తో సహా అందరి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు దర్శకుడు సాగర్ కె.చంద్ర.