దర్శకుడు పూరీ జగన్నాథ్ లైగర్ మూవీతో డిసాస్టర్ కొట్టి తొమ్మిది నెలలు అవుతుంది. ఆ సినిమా డిసాస్టర్ అవడం ఆయనని ఎంతగా ఇబ్బంది పెట్టిందో తెలియదు కానీ.. లైగర్ తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ఆయన్ని చాలా విసిగించారు. కోట్లలో నష్టపోయి.. నష్టాలను పూడ్చమంటూ పూరీ వెంట పడ్డారు. ఆ తర్వాత పూరీ కి ఈడీ విచారణ మరో సవాల్. అవన్నీ వదిలించుకుని పూరీ జగన్నాథ్ తన పార్ట్నర్ ఛార్మి తో కలిసి ముంబై వెళ్లి అక్కడే కథ, స్క్రిప్ట్ మీద కూర్చున్నాడు.
ఈమధ్యలో హీరో రామ్ తో పూరీ మూవీ ఓకె అయ్యింది.. ఈ కాంబోపై సరికొత్త ప్రకటన మే 15 రామ్ బర్త్ డే స్పెషల్ గా రాబోతుంది అన్న న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ అలా ప్రచారంలోకి వచ్చిన వెంటనే లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ ఫిలిం ఛాంబర్ ఎదుట నిరాహారదీక్షకు దిగడం కలకలం సృష్టించింది. లైగర్ తో నష్టపోయిన నైజాం డిస్ట్రిబ్యూటర్స్ ఫిలిం ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్షలకు దిగారు.
తమకి న్యాయం చెయ్యమని, పూరీ జగన్నాథ్ తమ నష్టాలని రికవరీ చేస్తామని చెప్పి ఆరు నెలలు గడిచిపోయినా ఇంతవరకు పూరీ ఎలాంటి నష్టాలూ పూడ్చలేదని, తమకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు, గడువు ఇచ్చి ఆరు నెలలు పూర్తయ్యింది, తమకి న్యాయం జరిగేలా చూడమంటూ వారు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు.