ఈమధ్యన వెబ్ సీరీస్ లకి బాగా గిరాకీ, డిమాండ్ ఏర్పడ్డాయి. ఓటిటీలు ప్రాచుర్యం పొందాక వెబ్ సీరీస్ లతో స్టార్ హీరోలు కూడా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. కేవలం సిల్వర్ స్క్రీన్ మాత్రమే కాదు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా సత్తా చాటుతున్నారు. అయితే తెలుగు ఓటిటి ఆహా అంటూ అరవింద్ గారు ఓ ఓటిటీని ప్రారంభించి సినిమాలు స్ట్రీమింగ్ తో పాటుగా స్పెషల్ షోస్, అలాగే స్ట్రయిట్ మూవీ రిలీజ్ లు, మ్యూజిక్ షోస్, వెబ్ సీరీస్ అంటూ అందరిని ఆహా అనిపిస్తున్నారు. రీసెంట్ గానే తమిళనాట కూడా ఆహా ఓటిటి హవా మొదలైంది. ఈ ఓటిటి నుండి ఒరిజినల్ వెబ్ సీరీస్ గా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది న్యూసెన్స్.
నవదీప్-బిందు మాధవి కీలక పాత్రల్లో శ్రీ ప్రవీణ్ కుమార్ తెరకెక్కించిన న్యూసెన్స్ గత అర్ధరాత్రి నుండి ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సీరీస్ ప్రమోషన్స్ లోనే డబ్బుకి మీడియా దాసోహం అంటూ కాంట్రవర్సీ లేవదీశారు. నిజంగానే న్యూసెన్స్ వెబ్ సీరీస్ మొత్తం మీడియా డబ్బుకి కక్కుర్తి పడి అసలు నిజాలను దాచేస్తుంది అని చెప్పే ప్రయత్నం చేసారు. జర్నలిస్ట్ లు తమ అవసరాల కోసం అసలు నిజాలని కప్పెట్టేసి చేతులు తడుపుకుంటూ పబ్బం గడిపేస్తుంటారు. ఓ ముసలి జంట పొలాన్ని రౌడీలు లాగేసుకుని కంచె వెయ్యడంతో పోలీస్ లు, ఎమ్మార్వో దగ్గర పని జరక్క మీడియాని శరణు కోరడంతో ఈ సీరీస్ మొదలవుతుంది. వారిని మీడియా నట్టేట ముంచేయడంతో ఆ ముసలాయన చనిపోతాడు(చంపబడతాడు).
అలాగే హత్య రాజకీయాలు, పోలీస్ వ్యవస్థలోని లోపాలు, డాక్టర్స్ డబ్బు కోసం చేసే నీచమైన పనులని కూడా టచ్ చేస్తూ వెబ్ సీరీస్ సాగింది. అయితే న్యూసెన్స్ సీజన్ 1 మొత్తం డబ్బుకి మీడియా దోసోహమనే కోణంలోనే చూపించారు. సీజన్ 2 లో ఆసక్తిని రేకెత్తించే కథాంశం ఉంటుంది అంటూ సీజన్ 1 ని అసంపూర్ణంగా ముగించారు. నవదీప్ ని జైలులో పెట్టడం, బిందు మాధవి ట్రాప్ లో ఇరుక్కోవడం, నారాయణ హత్య కోసం పోలీస్ ఆఫిసర్ చేస్తున్న ప్రయత్నాలు వీటన్నిటి క్లారిటీ సీజన్ 2 లో లభిస్తుంది అంటూ సీజన్ 1 ని ముగించేశారు.
కొన్ని సన్నివేశాలు రియల్ గా అనిపించినా.. ట్విస్ట్ లు లేకపోవడం ఈ సీరీస్ కి మైనస్, సినిమాటోగ్రఫీ బావున్నా స్లో నేరేషన్ బాగా ఇబ్బంది పెట్టేసింది. అయితే న్యూసెన్స్ సీరీస్ తో మేకర్స్ చెప్పాలనుకున్నది మాత్రం మీడియా డబ్బుకి అమ్ముడైపోయి అసలు నిజాలను దాచేస్తుంది అనేది ఈ సీజన్ లో స్పష్టం చేసారు. మరి న్యూసెన్స్ సీజన్1 చూసాక మీడియా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.