సమంత అభిమాని ఒకరు ఆమెకి గుడి కట్టి ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్స్ కి అభిమానులు గుడి కట్టడం అనేది కొత్త విషయం కాదు.. గతంలో ఖుష్బూ, హన్సిక, నిధి అగర్వాల్ లాంటి వాళ్ళకి తమిళనాడులో వీరాభిమానులు గుడి కట్టి పూజలు చేసారు. అభిమానం ఎక్కువైతే ఇలాంటి గుడులు కడతారు అభిమానులు. సమంతని విపరీతంగా ఆరాధించే బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన సందీప్ అనే అభిమాని ఆమెకి తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టి సమంత విగ్రహాన్ని పెట్టాడు.
నిన్న ఏప్రిల్ 28 ఆమె పుట్టిన రోజు సందర్భంగా సమంత గుడిని అంగరంగ వైభవముగా స్థానికులను పిలిచి పండుగలా ప్రారంభోత్సవాన్ని నిర్వహించాడు. హీరోయిన్ గా అభిమానించడమే కాకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవకి ఆకర్షితుడునై.. ఆమెపై ఇంకా అభిమానం ఎక్కువైంది అని సందీప్ ఇలా గుడి కట్టి సమంతని దేవతలా పూజిస్తున్నట్లుగా చెప్పాడు.
సమంత గత ఏడాది తనకి మాయోసైటిస్ ఎటాక్ అయ్యింది అని చెప్పినప్పుడు.. ఆమె త్వరగా కోలుకోవాలంటూ తిరుపతి, నాగపట్నం, కడప దర్గా, చెన్నైలోని దైవ క్షేత్రాలు సందర్శించి మొక్కుబడులు చెల్లించాడట సందీప్. అంతేకాకుండా సమంత అభిమానుల్లో తాను ప్రత్యేకంగా ఉండాలని ఉద్దేశంతో గుడి కట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.