దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు స్టార్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుని ఇండియా నుండి జపాన్ వరకు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి, ఆడియన్స్ నుండి అదుర్స్ అనిపించుకున్న ఆర్.ఆర్.ఆర్ విడుదలై ఈ రోజుకి ఏడాది పూర్తయ్యింది. గతఏడాది మార్చ్ 25 న థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల సందడి, అభిమానుల కోలాహలం, బెన్ఫిట్ షోస్ హంగామా, ఆర్.ఆర్.ఆర్ పబ్లిక్ టాక్ తో సోషల్ మీడియాలో రచ్చ, రామ్ చరణ్ ఫాన్స్, ఎన్టీఆర్ ఫాన్స్ పెట్టిన కటౌట్స్ ఇవన్నీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా మొత్తం జాతరని తలపించింది. ఓవర్సీస్ లో అయితే చెప్పక్కర్లేదు. ఒక్క స్టార్ హీరో సినిమా విడుదలైతే అభిమానులు క్రేజీగా రచ్చ చేసే ఫాన్స్, ఎన్టీఆర్-చరణ్ కలిసి నటిస్తే ఊరుకుంటారా అస్సలూరుకోరు.
బెన్ ఫిట్ షోస్ టికెట్స్ కోసం మూడు నుండి నాలుగు వేలు పెట్టిన వీరాభిమానులు, మొదటి రోజు మొదటి షో చూడడానికి ఇష్టపడని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉదయమే థియేటర్లు దగ్గర బారులు తీరేలా చేసిన రాజమౌళి ఈ చిత్రంతో గ్లోబల్ దర్శకుడిగా మారితే.. ఎన్టీఆర్-రామ్ చరణ్ లు గ్లోబల్ స్టార్స్ అయ్యారు. జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్స్ మోత, ఇండియాలో 1200 కోట్ల రాబడితో నిర్మాతలకు కాసుల పంట, రికార్డులు సృష్టించడమే కాదు.. హీరోలకి క్రేజు, రాజమౌళికి హైప్ అన్ని వచ్చేసాయి.
గత ఏడాదిగా ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ ని దర్శకుడు, హీరోలు నిన్న ఆస్కార్ వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆస్కార్ తో ఆర్.ఆర్.ఆర్ అవార్డుల పంట ఇంకా పూర్తి కాలేదు. ఫిల్మ్ ఫేర్, నంది, సైమా అవార్డ్స్ ఇలా బోలెడన్ని అవార్డులు ఆర్.ఆర్.ఆర్ చేజిక్కించుకోవాలి. అన్నిటిలో అరుదైన ఆస్కార్ కొల్లగొట్టడం కన్నా ఆర్.ఆర్.ఆర్ కి ఇంకేం కావాలి.
ఇక ఏడాది పూర్తి చేసుకునేలోపు ఆస్కార్ తో టీం అమెరికా నుండి హైదరాబాద్ కి చేరుకుంది. ముందుగా ఎన్టీఆర్, తర్వాత రాజమౌళి, రామ్ చరణ్ లు, నిన్న చంద్రబోస్ లు హైదరాబాద్ కి వచ్చారు. టీమ్ ఆర్.ఆర్.ఆర్ వన్ ఇయర్ సెలెబ్రేషన్స్ ఏమైనా చేస్తారేమో చూడాలి. ఎన్టీఆర్-చరణ్ ఫాన్స్ మాత్రం అద్భుత కళాఖండం ఆర్.ఆర్.ఆర్ కి వన్ ఇయర్ అంటూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.