ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే గోవిందుడు అందరి వాడేలే, నక్షత్రం లాంటి చిత్రాలు చూసాక దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో పస తగ్గింది అని చాలామంది ముక్త కంఠంతో చెబుతారు. ఒకప్పుడు అద్భుతమైన కళాఖండాలను తెరకెక్కించిన ఈ దర్శకుడితో సినిమాలు చెయ్యడానికి ఏ ఒక్క హీరో ఇంట్రెస్ట్ చూపించడమే లేదు. ఆయన మాత్రం తన పట్టుదలని వదలకుండా..ప్రకాష్ రాజ్ అడిగారని మరాఠీ మూవీ నట సామ్రాట్ ని తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేసారు. అంత గొప్ప దర్శకుడు చేసిన రంగమార్తాండని ఆయన రెండేళ్ల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసేసారు. కానీ విడుదల చెయ్యడానికి ఆయనకి ఏకంగా రెండుమూడేళ్లు పట్టింది.
ప్రకాష్ రాజ్-బ్రహ్మానందం-రమ్యకృష్ణ.. ఇలాంటి సీనియర్ నటులతో సినిమా చేసారు. ఒక్క పేరున్న హీరో కానీ, హీరోయిన్ కానీ లేరు.. సినిమా ఎలా ఉంటుందో అని చాలామంది అనుమానపడ్డారు. కానీ కృష్ణవంశీ ఎలాగో కష్టాలు పడి సినిమాని థియేటర్స్ వరకు తీసుకొచ్చారు. అంతేకాకుండా పది రోజుల నుండి రంగమార్తాండ ప్రీమియర్స్ వేసి సెలబ్రిటీస్ తో సినిమాకి పబ్లిసిటీ ఇప్పించడం, రంగమార్తాండ ప్రీమియర్స్ చూసిన వారు ఆహా ఓహో.. కృష్ణవంశీ దర్శకత్వం అద్భుతం, ప్రకాష్ రాజ్-బ్రహ్మానందం పోటీ పడి నటించారు, ఈ చిత్రం బ్రహ్మాండం అంటూ సినిమాపై పెంచి ఆసక్తి చూసిన కొంతమంది.. ఏకంగా కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రాహ్మిలకి 40 అడుగుల కటౌట్స్ కట్టేసారు.
నిజంగా రాజమౌళి లాంటి పాన్ ఇండియా దర్శకుడికి కటౌట్ కట్టడం చూసాం కానీ.. ఇలా కృష్ణవంశీకి అలాగే సీనియర్ నటులైన ప్రకాష్ రాజ్, బ్రహ్మి, రమ్య కృష్ణకి కటౌట్స్ కట్టడం చూస్తే, నిజంగా ఈ రేంజ్ అభిమానం వాళ్ళు కూడా ఊహించు ఉండరు. హైదరాబాద్ లోని ఓ ఏరియాలో కృష్ణవంశీ వాళ్ళ కటౌట్స్ చూసిన వారు.. ఆ పిక్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.