సోషల్ మీడియా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చాక దానితో మంచి కన్నా ఎక్కువగా చెడే పాపులర్ అవుతుంది. బ్రతికున్న వాళ్ళని చంపేసి.. సానుభూతి చూపించెయ్యడం, కొంతమంది జంటలు బాగానే ఉన్నా వారికి విడాకులు ఇప్పెంచేయడం, అలాగే సెలబ్రిటీస్ కి సోషల్ మీడియా గాసిప్స్ పెళ్లి చేసెయ్యడం ఇలాంటి చెడు విషయాలను ఎక్కువగా చూపిస్తుంది. అలా ప్రచారం జరిగే వాటిని కొంతమంది స్వయంగా ఖండించడం లాంటివి చూస్తున్నాము.
ఇంతకుముందు ఇలాంటి వార్తలను చాలామంది ప్రముఖులు ఖండించినట్లుగానే.. ఇప్పుడు సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు గారు మృతి చెందారంటూ ప్రచారం జరగడం.. దానిని ఆయన ఖండిస్తూ ఓ వీడియో షేర్ చెయ్యడం జరిగింది. ఆ వీడియోలో కోట మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. నేను ఇలా ఇప్పుడు మీ ముందుకు వచ్చాను అంటే.. నేను మృతి చెందినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయట. ఆ విషయం నాకు తెలియదు.
ఈరోజు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో నేను రేపు ఉగాది కదా.. దాని గురించి ఇంట్లో వాళ్లతో మాట్లాడుతున్నాను. ఇంతలో నాకు వరుస పెట్టి ఫోన్లు రావడం మొదలయ్యాయి. నేనే దాదాపు 50 ఫోన్లు మాట్లాడాను. మా కుర్రాళ్లు కూడా కొన్ని ఫోన్లు మాట్లాడారు. అసలు ఆశ్చర్యం ఏంటంటే.. పోలీసులు కూడా మా ఇంటికి వచ్చారు. వాళ్లు నన్ను చూసి షాకయ్యి ఏంటి సార్.. ఇదంతా, మీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి.. మీరు చాలాపెద్ద మనిషి కదా.. అందుకే చాలా మంది వస్తారు.. ఇక్కడేమి జరక్కూడదని సెక్యురిటీ ఇద్దామని వచ్చాం అన్నారు.
దానితో నేను షాకై.. ఏంటి సర్ ఇది.. మీరే ఇలాంటి వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాలి.. ఎవరైనా భయస్తులు ఉంటే నిజంగా గుండె ఆగి చనిపోతారు.. అని పోలీస్ లతో చెప్పాను, ప్రజలు కూడా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వార్తలను నమ్మవద్దు. ఇలాంటి తప్పుడు వార్తల మీద ప్రజలు గట్టిగా రియాక్ట్ అయితేనే వారికి బుద్ధి వస్తోంది. మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు.. అంటూ కోట తన మృతిపై వస్తున్న వార్తలపై రియాక్ట్ అయ్యారు.