తన నటనతో అందరినీ మైమరపించే ఎన్టీఆర్.. మరో హీరో నటనని చూసి షాకయ్యానంటే.. నిజంగా ఇది షాకయ్యే విషయమనే చెప్పుకోవాలి. ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రంలో ఒక నటుడిగా కామెడీ చేయకుండా కామెడీ పండించాడు విశ్వక్ సేన్. ఎంత కామెడీ అందులో పండిస్తాడో.. అంతే బాధని కూడా లోపల దిగమింగుకుని ఉంటాడు. తొలిసారి నటించే అతను అంత ఎక్స్‌ప్రెషన్‌ని, అంత ఎమోషన్‌ని కంట్రోల్ చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. అతని కాన్ఫిడెన్స్ చూసి నేను షాకయ్యానని అన్నారు యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్. విశ్వక్ సేన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘దాస్ కా ధమ్కీ’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. విశ్వక్ యాటిట్యూడ్‌పై, నటనపై ప్రశంసల వర్షం కురిపించారు.
‘‘ఎప్పటి నుంచో బాకీ ఇది. బాకీ కాదు బాధ్యత. విశ్వక్ చేసిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నేను రావాలి. కానీ కుదరలేదు. నేను మూడ్ ఆఫ్ అయినప్పుడు చాలా తక్కువగా సినిమాలు చూస్తుంటాను. అందులో ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రం ఎక్కువగా చూస్తాను. అందులో విశ్వక్ నటుడిగా కామెడీ చేయకుండా కామెడీ పండించాడు. ఎంత కామెడీ పండిస్తాడో.. అంతే బాధని కూడా లోపల దిగమింగుకుని ఉంటాడు. ఒక యాక్టర్ అంత ఎక్స్‌ప్రెషన్‌ని, అంత ఎమోషన్‌ని కంట్రోల్ చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది. ఆ చిత్రం తర్వాత ‘ఫలక్‌నుమా దాస్’ చూశాను. తనే దర్శకత్వం వహించాడు. యాక్టర్‌గా ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటాడో దర్శకుడిగా అంతే కాన్ఫిడెంట్‌గా చేశాడు. ఆ తర్వాత ‘పాగల్’ అనే సినిమా చేశాడు. విశ్వక్ ఓ చట్రంలోకి వెళ్లిపోతున్నాడా అని అనుకుంటున్నప్పుడు.. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చేశాడు. ఆ సినిమా చూసినప్పుడు మాత్రం షాకయ్యాను. ఇంత యాటిట్యూడ్ ఉన్న మనిషి.. అంతలా ఛేంజ్ అవుతాడా? అని అనిపించింది. నేను కూడా నా కెరీర్‌లో ఒకప్పుడు ఇలాంటి చట్రంలోకే వెళ్లిపోయాను. అయితే చాలా సినిమాల తర్వాత రియలైజ్ అయ్యాను. అప్పుడు నేనొక మాట చెప్పాను.. మీ అందరినీ కాలర్ ఎగరేసుకునేలా సినిమాలు చేస్తాను అని. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజే నేను మళ్లీ నటుడిగా పుట్టాను.
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ తర్వాత ‘హిట్’ అనే మూవీ చేశాడు విశ్వక్. అది చూసి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కంపోజ్డ్‌గా తనని తాను క్యారీ చేశాడు. ఇది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. చాలా చాలా కష్టం. అది విశ్వక్‌కి కుదిరింది. అది అతని పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. తనకి తాను ప్రూవ్ చేసుకోవాలని బయలుదేరిన నటుడు తను. ఇప్పుడు ‘దాస్ కా ధమ్కీ’ అనే చిత్రం చేస్తున్నాడు. మళ్లీ తనే దర్శకత్వం చేశాడు. ఈ సినిమా నిజంగా బ్లాక్‌బస్టర్ కావాలి. ఈ సినిమాతో ఆయన డైరెక్షన్ ఆపేయాలి. ఎంతో మంది దర్శకులు ఉన్నారు. విశ్వక్ లాంటి హీరో వారందరి డైరెక్షన్‌లో హీరోగా సినిమాలు చేయాలి. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టేసి దర్శకత్వం ఆపేయాలని విశ్వక్‌ని కోరుతున్నా. ఎందుకంటే తెలుగు సినిమా ఆల్ టైమ్ టాప్‌లో ఉంది. ప్రపంచ పటంపై తెలుగు సినిమాని పడిపోనివ్వకుండా.. అలా నిలబెట్టుకోవాలి. విశ్వక్ మా ఇంటికి వచ్చినప్పుడు ఒక మాటన్నాడు. నాకు చాలా బాధేసింది. అన్నా.. ఈ సినిమా కోసం ఉన్నదంతా పెట్టేశానని చెప్పాడు. సినిమా అంటే అతనికి అంత పిచ్చ. ఆ యాటిట్యూడ్ ఉన్నటువంటి పిచ్చి తగ్గిపోకూడదు. ఇలాంటి వాళ్లే ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్లగలరు. ఇలాంటి వాళ్లని మనం ఎంకరేజ్ చేయాలి. మార్చి 22న వస్తున్న ఈ సినిమా అందరూ బ్లాక్‌బస్టర్ చేయాలి..’’ అని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.