రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ సాధించారు. ఇప్పుడు రాజమౌళి గ్లోబల్ స్టార్ డైరెక్టర్. అంటే ఆయనతో సినిమాలు చెయ్యబోయే హీరోలు ఇకపై గ్లోబల్ స్టార్ అవుతారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్స్ ని చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు ని గ్లోబల్ స్టార్ చెయ్యబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ హడావిడి అమెరికాలో రాజమౌళి ఇచ్చిన పార్టీతో ముగియగా.. ఇక్కడ స్వదేశంలోను ఈ ఆస్కార్ పార్టీల హడావిడి మొదలు కాబోతుంది. రామ్ చరణ్-ఎన్టీఆర్-రాజమౌళి ముగ్గురు ఈ శుభాకాంక్షల జడివానలో తడిచి ముద్దవుతారు.
అదంతా ముగియగానే రాజమౌళి మహేష్ సినిమా కథ, స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అయితే మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతుండగా.. ఈ చిత్రం ఆగష్టు 11 న విడుదల చేసే ఉదేశ్యంలో మేకర్స్ ఉన్నారు. తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమాకి రెడీ అవుతాడు. అయితే రాజమౌళి మహేష్ తో ప్రపంచం మెచ్చే కథతోనే సినిమా చెయ్యబోతున్నారు.. అంటూ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెబుతూ వస్తున్నారు.
తాజాగా విజయేంద్రప్రసాద్ గారు రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. రాజమౌళి మహేష్ తో చెయ్యబోయే చిత్రాన్ని అందరి అంచనాలు మించేలా తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారని అన్నారు. అయితే ఈ చిత్రంలో మెసేజ్ లు వంటివి ఉండవని, ఇంటిల్లిపాది హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే మూవీగా ఉండబోతుంది అన్నారు. అంటే రాజమౌళి-మహేష్ కాంబో కథ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందేమో అనే అనుమానాలు వచ్చేలా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు.
ఏది ఏమైనా మహేష్-రాజమౌళి చిత్రంపై విజయేంద్ర ప్రసాద్ స్పందించిన తీరుకు, ఆయన ఇచ్చిన అప్ డేట్ కి మహేష్ ఫాన్స్ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ఆస్కార్ స్టార్ రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ కలిస్తే బాక్స్ లు బద్దలు అవడం ఖాయమంటూ వారు డిసైడ్ అవుతున్నారు.