ప్రస్తుతం ఇండియా మొత్తం ఆర్.ఆర్.ఆర్ గురించే మట్లాడుకునేలా చేసారు ఎస్.ఎస్ రాజమౌళి. నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ కొట్టి చూపించారు. ఎవ్వరి ఊహకి అందని ఆస్కార్ ని కొల్లగొట్టి తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులు కల నిజం చేసి చూపించారు. మార్చ్ 12 అమెరికా లాస్ ఏంజిల్స్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు పాట అవార్డు గెలుచుకోవడం అందరికి పట్టరాని ఆనందాన్నిచ్చింది. ప్రపంచ పటంలో టాలీవుడ్ గురించి మాట్లాడుకునేలా చేసి అందరి చేత శెభాష్ అనిపించారు రాజమౌళి.
నాటు నాటు సాంగ్ లో చరణ్-ఎన్టీఆర్ లు పోటీ పడి చేసిన డాన్స్ కి ప్రతి ఒక్కరూ ఫిదానే. అయితే ఇప్పుడు రామ్ చరణ్-ఎన్టీఆర్ లు ఇద్దరూ కలిసి హాలీవుడ్ స్టార్స్ ని కూడా వెనక్కి నెట్టి మరీ ప్రముఖ అమెరికన్ మార్కెట్ ఇంటలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్ లిస్ట్ లో మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఆస్కార్డ్స్ అవార్డ్స్ జరిగిన మార్చి 12 న సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన టాప్ 5 లిస్ట్ ని ప్రముఖ అమెరికన్ మార్కెట్ ఇంటలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో దాదాపు 24 గంటల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి హాలీవుడ్ స్టార్స్‌ని వెనక్కి నెట్టి మన సినిమాలు, మన స్టార్స్ ముందు స్థానాల్లో నిలిచారు.
టాప్ 5 సినిమాల లిస్ట్ లో హాలీవుడ్ మూవీస్ ని వెనక్కి నెట్టి లిస్ట్ లో మొదటి స్థానంలో RRR నిలవగా, రెండో స్థానంలో ఆస్కార్ గెలుచుకున్న మరో ఇండియన్ డాక్యుమెంటరీ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో హాలీవుడ్ మూవీస్ నిలిచాయి. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే.. టాప్ 5 లిస్ట్ లో నెంబర్ వన్ స్థానంలో ఎన్టీఆర్, రెండో స్థానంలో రామ్ చరణ్ నిలిచి.. హాలీవుడ్ స్టార్స్ కి దిమ్మతిరిగే షాకిచ్చారు. దానితో ఎన్టీఆర్-చరణ్ ఫాన్స్ మా హీరోలిద్దరూ కుమ్మేసారుగా అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఆనందాన్ని పంచుకుంటున్నారు.