నిజంగా ప్రతి తెలుగోడు పొగరుగా తలెత్తుకుని గర్వం తిరిగే సమయాన్ని అందరికి అందించిన ఘనత రాజమౌళిదే. ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు పాటకి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్నట్లుగా ప్రకటించగానే తెలుగు వాళ్లందరికీ గూస్ బమ్ప్స్ వచ్చాయి. హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి. నాటు నాటు సాంగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ప్రపంచ చలన చిత్రరంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును మన తెలుగు పాట.. నాటునాటు సొంతం చేసుకోవడం నిజంగా భారతీయ చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచింది.
తెలుగు ప్రేక్షకులే కాదు.. ఇండియన్స్ అంతా ఎంతో గర్వపడుతున్న సందర్భం ఇది. గతంలో 1983లో నిర్వహించిన 55వ ఆస్కార్ వేడుకల్లో భాను అథైయా గాంధీ సినిమాకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆస్కార్ అందుకున్న మొదటి భారతీయరాలుగా చరిత్ర సృష్టించారు. మధ్యలో స్లమ్ డాగ్ మిలినీర్ కి ఏకంగా మూడు ఆస్కార్ అవార్డ్స్ రావడం ఇప్పుడు రాజమౌళి ఆధ్వర్యంలో కీరవాణి-చంద్ర బోస్ ఆస్కార్ వేదికపై అవార్డు అందుకోవడం నిజంగా అందరూ గర్వపడే మధురక్షణాలు. రాజమౌళి-రమా రాజమౌళి, కార్తికేయ-పూజ, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆస్కార్ గ్యాలరికే పరిమితం కాగా.. కీరవాణి-చంద్ర బోస్ లకి ఆస్కార్ రెడ్ కార్పెట్ పై కూర్చునేందుకు అవకాశం దక్కింది.
ఇక అవార్డు అందుకోవడానికి స్టేజ్ పైకి ఎక్కిన కీరవాణి, చంద్ర బోస్ లు సంతోషంగా కనిపించగా.. రమా రాజమౌళి, రాజమౌళి ఎమోషనల్ గా కనిపించారు. ప్రస్తుతం తెలుగు ఛానల్స్, సోషల్ మీడియాలో మొత్తం నాటు నాటు పాటతో మార్మోగిపోతోంది. సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా ఆర్.ఆర్.ఆర్ ని పొగిడేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. వీలున్నవారు ఛానల్స్ ద్వారా ఆనందాన్ని పంచుకుంటూ ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి కంగ్రాట్స్ చెబుతున్నారు.