దగ్గుబాటి సురేష్ బాబు, రానా తనని రౌడీలతో బెదిరించారంటూ ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి నాంపల్లి కోర్టుని ఆశ్రయించడం అందరికి తెలిసిందే. ఫిల్మ్ నగర్ కి చెందిన భూ వివాదంలో తనని బెదిరించిన సురేష్ బాబు, రాణాలపై కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో ప్రమోద్ కోర్టులో కేసు వెయ్యగా.. కోర్టు జోక్యంతో సురేష్ బాబు, రానా ఇంకా కొంతమందిపై కేసు నమోదు చేసారు. ఫిలింనగర్ రోడ్ నెంబర్ 1లో సినిమా యాక్టర్ మాధవికి చెందిన ప్లాట్ నెంబర్ 2ని గతంలో సురేష్ బాబు కొనుగోలు చేశారు. ఆ స్థలం పక్కనే హీరో వెంకటేష్ తనకు చెందిన ప్లాట్ నంబర్ 3లోని 1000 గజాలను ప్రమోద్ అనే బిజినెస్ మ్యాన్‌కి లీజుకిచ్చారు.
అయితే ఆ లీజు సమయం ముగుస్తూ ఉండడంతో సురేష్ బాబు ఆ స్థలాన్ని విక్రయించేందుకు మొగ్గు చూపడంతో.. ప్రమోద్ కుమార్ ఆ స్థలాన్ని కొనుగోలు చేస్తాను అని ఓ 5 కోట్లు సురేష్ బాబుకి అడ్వాన్స్ ఇవ్వగా.. అడ్వాన్స్ తీసుకున్న సురేష్ బాబు.. తన స్థలం లీజు ముగిసినా ప్రమోద్ తన స్థలాన్ని ఖాళీ చెయ్యడం లేదు అంటూ కోర్టులో కేసు వేసి ప్రమోద్ కుమార్ కి నోటీసులు పంపారు. కానీ ప్రమోద్ కి ఆ స్థలం ఇస్తాను అని చెప్పిన సురేష్ బాబు కేసు ముగియకముందే ఆ స్థలాన్ని రానాకి అమ్మేసారు.
గత ఏడాది నవంబర్‌లో లీజు స్థలంలో ఉంటున్న ప్రమోద్ కుమార్ సెక్యూరిటీని రానా, సురేష్ బాబు మనుషులు వెళ్లగొట్టడమే కాకుండా.. ప్రమోద్‌ను బెదిరించడంతో అతను పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవటంతో ప్రమోద్ నాంపల్లి కోర్టుకు వెళ్లడంతో నాంపల్లి కోర్టు రానాకీ, సురేష్ అబుకి విడివిడిగా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించినట్లుగా తెలుస్తుంది.