అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా విపరీతమైన క్రేజీ హీరోగా మారాడు. గత ఏడాది సినిమా షూటింగ్స్ పక్కనబెట్టి కేవలం పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ షూట్స్ చేసాడు. డిసెంబర్ నుండి పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సంక్రాంతి ఫెస్టివల్ ముగిసాక అల్లు అర్జున్ వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో దర్శకుడు సుకుమార్ పుష్ప షూటింగ్ చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ వైజాగ్ లో కాలు పెట్టగానే ఆయన ఫాన్స్ అల్లు అర్జున్ కి ఘన స్వాగతం పలికారు. తాజాగా అల్లు అర్జున్ తన ఫాన్స్ కోసం స్పెషల్ ఫోటో షూట్ ఏర్పాటు చేసాడు. పుష్ప షూటింగ్ బ్రేక్ లో ఫాన్స్ తో ఫొటోస్ దిగేందుకు అల్లు అర్జున్ రెడీ అయ్యాడు.
బన్నీతో ఫొటోస్ అనగానే అల్లు ఫాన్స్ ఎగబడ్డారు. భారీగా చేరుకున్న అభిమానులలో కొందరితో అల్లు అర్జున్ ఫొటోలు దిగాడు. అయితే కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపటంతో ఫోటోషూట్ వేదిక రసాబాసగా మారింది. దీంతో అల్లు అర్జున్ ఫొటో షూట్ సెషన్‌ను క్యాన్సిల్ చేసేసి వెళ్లిపోయాడు. బన్నీ ఫొటో షూట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయాడనే సంగతి తెలియగానే అభిమానులు నిరాశకు లోనవడం పక్కనబెడితే.. కొందరైతే స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎంతో ఆశగా వచ్చాము, బన్నీ అన్నతో ఫొటోస్ దిగుదామని, కానీ బన్నీ అన్న వెళ్లిపోయాడంటూ వారు కళ్ళ నీళ్లు పెట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. పుష్ప పార్ట్ 2 షూటింగ్ కొత్త షెడ్యూల్ లో హీరోయిన్ రష్మిక కూడా సెట్స్ లో జాయిన్ అవ్వబోతుంది.