ఈరోజు సోమవారం సాయంత్రం అల్లు అరవింద్ ఇంపార్టెంట్ ప్రెస్‌మీట్‌కి పిలుపునివ్వడంతో ఉదయం నుండి టాలీవుడ్ సర్కిల్ మరియు సోషల్ మీడియా హోరెత్తింది. అల్లు అరవింద్ పెట్టబోయే ప్రెస్ మీట్ వెనుక కారణం అధికారికంగా చెప్పనప్పటికీ, పరశురామ్ మరియు విజయ్ దేవరకొండల కాంబినేషన్‌లో నిన్న ఆదివారం దిల్ రాజు ఓ చిత్రాన్ని ప్రకటించడమే అసలు కారణమని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గీత గోవిందం సినిమాతో తనని స్టార్ డైరెక్టర్ ని చేసిన గీత ఆర్ట్స్ బ్యానర్ కి మరో సినిమా చేసే ఒప్పందం జరిగింది దర్శకుడు పరశురామ్ కి. ఇప్పుడు సడెన్ గా పరశురామ్, నిర్మాత దిల్ రాజు,
విజయ్ దేవరకొండల కలయికలో సినిమా రానుందనే ప్రకటన వెలుగులోకి రావడం అల్లు అరవింద్ కి ఆగ్రహం తెప్పించింది అనేది ఇన్ సైడ్ టాక్. అందుకే ఓ ప్రెస్ మీట్ పెట్టి పరశురామ్-దిల్ రాజు పై అల్లు అరవింద్ విరుచుకుపడతారు అనే ప్రచారం ఉదయం నుంచి బలంగా వినిపించింది. ఏ పీఆర్ టీం ఎంతగా నడిపించిందో తెలియదుకానీ.. మీడియాలో ఈ వార్త విపరీతంగా వ్యాపించింది.
అయితే అనుభవజ్ఞుడు, అగ్రనిర్మాత అయిన అల్లు అరవింద్ ప్రెస్ మీట్ కి ఆహ్వానం అంటే ముందస్తు ప్రణాళికలు, ప్రకటనలు అక్కర్లేదు అనేది అందరికి తెలిసిన వాస్తవం. ఉన్నపళంగా ఉదయాన్నే ప్రెస్ మీట్ అన్నా మెగా కాంప్ కి ఉన్న విలువ రీత్యా మీడియా మిత్రులు తరలి వస్తారు. కానీ ఇక్కడే సాలిడ్ గా అలోచించి అల్లు అరవింద్ తనదైన శైలి, స్ట్రాటజీ చూపించారనేది పరిశ్రమలోని పలుకవురి అభిప్రాయం. సాయంత్రం ప్రెస్ మీట్ అని అనౌన్స్ చేయించి, ఆ సమావేశం తాలూకు కారణాన్ని కూడా కావాలనే సోషల్ మీడియాకి లీకులు ఇప్పించి తన మాస్టర్ మైండ్ తో ఒక టీసింగ్ గేమ్ ప్లే చేస్తున్నారా.. అనిపించేలా ఈ ఎపిసోడ్ మొత్తం నడిచింది.
మొత్తానికి అనుభవమే నిలిచింది. ఆయన ఆడిన ఆటే గెలిచింది. ఆశించినదే జరిగింది అనేది ప్రస్తుతం పరిశీలకులు అల్లు వారిపట్ల వెల్లడిస్తున్న అభిప్రాయం. ఎందుకంటే ప్రెస్ మీట్ మేటర్ ఎంత ప్లాన్డ్ గా ఎనౌన్స్ చేసారో.. క్యాన్సిలేషన్ మేటర్ ని అంత సడన్ గా రివీల్ చేసారు. ఈ మొత్తం తతంగం వెనుక తెరచాటు వ్యవహారాలు, తెలివైన ఒప్పందాలు చాలా జరిగాయట. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎటువంటి కాంప్రమైజింగ్స్ జరిగాయో, ఎవరికి ఎలాంటి కాంపన్సేషన్స్ లభిస్తాయో వేచి చూద్దాం.