నేడు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు. సినిమాలతో గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన బ్రహ్మానందం.. కొద్దిరోజులుగా సినిమాల్లో కనిపించకపోయినా.. మళ్ళీ ఇప్పుడు బిజీ అవుతున్నారు. ఈ ఏడాది బ్రహ్మి నటిస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే నేడు బ్రహ్మి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకి సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్స్ వేస్తున్నారు. అలాగే ఆయన నటిస్తున్న సినిమాల నుండి ఆయనకి బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు.
కానీ మెగాస్టార్ చిరు స్వయంగా బ్రహ్మ్మనందం ఇంటికి వెళ్లి ఆయనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి మరీ ప్రేమతో బ్రహ్మికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. బ్రహ్మితో పాటుగా ఆయన భార్య, కొడుకు గౌతమ్ లు ఉన్నారు. బ్రహ్మికి చిరు వేంకటేశ్వరుని విగ్రహం ఇస్తూ విష్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన.. నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఓ లెక్చరర్, ఈరోజు బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కిన గొప్ప హాస్య నటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కామెడీకి నిలుఎత్తు నిదర్శనం.
ఆయన కామెడీ చెయ్యక్కర్లేదు. ఆయన మొహం చూస్తేనే హాస్యం వెల్లువిరుస్తుంది. పొట్ట చక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మానందానికి హృదయపూర్వక శుభాభినందనలు. బ్రహ్మానందం ఇలానే జీవితాంతం నవ్వుతూ.. పదిమందిని నవ్విస్తూ ఉండాలని, బ్రహానందానికి మరింత బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండాలని, తన పరిపూర్ణ జీవితం ఇలానే బ్రహ్మానందంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తనకి నా జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరు ట్వీట్ చేసారు.