గత ఏడాది బాలీవుడ్ పై ఏర్పడిన నెగిటివిటీకి అక్కడి ప్రముఖులు తలలు పట్టుకున్నారు. ఎన్నో అంచనాల మధ్యన విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలన్నీ 100 కోట్ల మార్క్ దాటలేక చేతులెత్తేశాయి. అటు సినిమాలు అట్టర్ ప్లాప్ లు. ఇటు నెటిజెన్స్ నెగిటివిటి మధ్యన బాలీవుడ్ నలిగిపోయింది. అసలు సౌత్ సినిమాలు బాలీవుడ్ మూవీస్ ని అడుగడుగునా తొక్కేయ్యడం మరింతగా ఆజ్యం పోసింది. సౌత్ సినిమాలని తలదన్నేలా సినిమాలు చెయ్యాలని అక్కడి దర్శకులు కిందా మీదా పడినా వర్కౌట్ అవ్వకపోవడంతో హిందీ సినిమా పనైపోయింది అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్.
ఇక చివరికి అక్కడి దర్శకనిర్మాతలు కూడా హీరోల రెమ్యునరేషన్స్ విషయంలో మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. గత ఏడాది భూల్ భులైయా 2, దృశ్యం 2, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలు మాత్రమే కోట్లు కొల్లగొట్టాయి. ఇక సినిమాలు విడుదలకు ముందు సోషల్ మీడియాలో బాయ్ కాట్ హాష్ టాగ్స్ తో నెటిజెన్స్ హిందీ వాళ్ళని ఒణికించేశారు. కానీ ఈ ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్ తో శుభారంభాన్ని బాలీవుడ్ కి అందించాడు. నిన్న బుధవారం రిలీజ్ అయిన పఠాన్ మూవీ కి భారీ ఓపెనింగ్స్ దక్కాయి.
దీపికా పదుకొనే గ్లామర్ తో పాటు పఠాన్ కి జాన్ అబ్రహం విలనిజం, అలాగే యూనిక్ స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్, మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎంట్రీ లాంటి ఫ్యాన్స్ మెచ్చే పాయింట్స్ అన్ని తోడయ్యేసరికి యావరేజ్ మూవీ కూడా భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. అడ్వాన్స్ బుకింగ్ తోనే రికార్డులు సృష్టించిన పఠాన్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ పరంగా.. షారుఖ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన చిత్రంగా నిలిచింది. పఠాన్ మూవీ ఫస్ట్ డే.. బాలీవుడ్ లో 65 కోట్లు వరకూ గ్రాస్, 55 కోట్లు వరకూ నెట్ కలెక్సన్స్ వచ్చాయని తెలుస్తుంది.
ఇక ఈ రోజు రిపబ్లిక్ డే హాలిడే కలిసిరావడంతో పఠాన్ సెకండ్ డే కలెక్షన్స్ పరంగాను కొత్త నెంబర్లు నోట్ చేసేలా కనబడుతుంది ప్రస్తుత వ్యవహారం. సాలిడ్ టాక్ కి తోడు వీకెండ్ వరకు పఠాన్ 300 కోట్లు వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణుల అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన బాలీవుడ్ కరువు తీరిపోయినట్టే. ఇంకో హిట్ పడితే హిందీ వాళ్ళు ఇక ఎక్కడా ఆగరేమో.