కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దిల్ రాజు-వంశి పైడిపల్లి వారిసు చిత్రాన్ని తెలుగు, తమిళంలో తెరకెక్కించారు. కోలీవుడ్ లో అజిత్ తునివుతో పోటీ పడుతున్న విజయ్ వారిసు, తెలుగులో బాలకృష్ణ వీర సింహ రెడ్డి, చిరంజీవి వాల్తేర్ వీరయ్యలతో పోటీకి దిగింది. కోలీవుడ్ లో పొంగల్ సందర్భంగా నేడు జనవరి 11న ఆడియన్స్ ముందుకు వచ్చిన వారిసు.. తెలుగులో మాత్రం వారసుడుగా ఈరోజు విడుదల కాలేదు. శనివారం జనవరి 14 భోగి పండగ రోజున వారసుడు విడుదల కాబోతుంది. అయితే తమిళ్ వారిసు ప్రీమియర్స్ షోస్ ఇప్పటికే పడిపోగా.. తమిళనాట మొదటి షో కూడా కంప్లీట్ అయ్యింది.
మరి విజయ్ వారిసుని వంశి పైడిపల్లి ఎలా ప్రెజెంట్ చేసాడో ప్రీమియర్స్ టాక్ లో తెలుసుకుందాం.. వారిసు కథలోకి వెళితే.. రాజేంద్రన్ (శరత్ కుమార్) మల్టీ మిలియనీర్. బిజినెస్ లో ఎప్పుడూ సక్సెస్ కావాలని అనుకుంటూ ఉంటాడు. రాజేంద్రన్ కి ముగ్గురు కొడుకులు, శ్యామ్, శ్రీకాంత్, విజయ్. ఇద్దరు కొడుకులు ఆయన కంపెనీలో పనిచేస్తుంటారు. మూడో కొడుకు విజయ్ మాత్రం ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటాడు. విజయ్ కి తండ్రి చేసే పనులు నచ్చక ఇంట్లో నుంచి బయటకెళ్లిపోతాడు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల తిరిగి వచ్చిన విజయ్ ఫ్యామిలీ, బిజినెస్ సమస్యలని ఎలా పరిష్కరించాడో అనేది వారిసు కథగా చెబుతున్నారు.
వారిసు ట్రైలర్ లో చూపించినట్లే ఫ్యామిలీ ఎమోషన్స్, బిజినెస్ రైవల్స్ తో యాక్షన్ సీన్స్ తో సినిమాని రిచ్ గా తీశారు. విజయ్ వన్ మ్యాన్ షో చేసాడని ఓవర్సీస్ పబ్లిక్ టాక్. విజయ్ అటు యాక్షన్ సీన్స్ లో, ఇటు ఎమోషనల్ గా ఆకట్టుకోగా.. డాన్స్ లు కూడా కుమ్మేసాడంటున్నారు. కానీ కథ చాలా సింపుల్ గా ఉండడం, అది కూడా రొటీన్ గా అనిపించడం, చాలా తెలుగు సినిమాలని మిక్సీ లో వేసి రుబ్బినట్లుగా జ్ఞప్తికి రావడం, విజువల్ ఎఫెక్ట్స్, సినిమా నిడివి కూడా మెయిన్ మైనస్ లుగా చెబుతున్నారు. తమన్ మ్యూజిక్ , కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు.
కొన్ని కామెడీ సీన్స్‌తో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప మిగిలిన భాగం అంతా సాదాసీదాగానే సాగుతుంది అంటూ కొంతమంది ఆడియన్స్ వారసుపై పెదవి విరుస్తున్నారు. మరి తమిళ వారిసు రంగు ఈరోజు బయటపడిపోయింది.. ఇక తెలుగు వారసుడు ఏమవుతుందో జనవరి 14 న తెలిసిపోతుంది.