గొంతు చూస్తే కంచు.. మనసు మాత్రం మంచు
మాట చూస్తే ఖరుకు.. మనిషేమో నిలువెత్తు చెరుకు
పత్రికల్లో ఇటువంటి వాక్యాలు రాసేది ఆ ఒకే ఒక్క విశిష్ట వ్యక్తిపై..!
పరిశ్రమలో ఈ వ్యాఖ్యలు వినిపించేది ఆ ఒకే ఒక్క విలక్షణ నటుడిపై.!!
దశాబ్దాలుగా విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోన్న విఖ్యాత నటుడు విద్యావేత్తగా రూపాంతరం చెందడాన్ని, నిష్కల్మష మనసుతో నిర్మాణాత్మక కార్య కలాపాలకు శ్రీకారం చుట్టడాన్ని తర తరాలు తలుచుకునేలా తన చేతలతో చాటి చెప్పిన మోహనుడు.. రాబోయే తరాలకు కూడా తన విద్యానికేతన్ నీడలో ముందడుగులు పడేలా తీర్చిదిద్దిన సమ్మోహనుడు మంచు మోహన్ బాబు.
తరచుగా ఆయన వివాదాస్పద వార్తలకి కేంద్ర బిందువు అవుతూ ఉంటారు.
దాంతో సన్నిహితులు బాధపడతారు. మోహన్ బాబు మాత్రం మామూలే అనుకుంటారు.
తరచుగా ఆయనపై సో కాల్డ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ లాంటివి జరుగుతుంటాయి.
వాటిపై శ్రేయోభిలాషులు గోల పెడతారు. మోహన్ బాబు మాత్రం అవి చేసేవారిపై జాలి పడతారు.
ఎవరేం అనుకున్నా.. ఎవరెన్ని అంటున్నా పెద్దగా పట్టించుకోని పెదరాయుడు ఆయన.
ఎవ్వరైనా.. ఎప్పుడైనా నేరుగా తలపడే ధైర్యం చెయ్యలేని అసెంబ్లీ రౌడీ ఆయన.
ఈ రాయలసీమ రామన్న చౌదరి రీసెంట్ గా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ లకి అందించిన ఓ ప్రత్యేక ఆతిధ్యం ప్రస్తుతం టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే....
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన సాటిలేనిమేటి నటనతో అద్భుతమైన ఆహార్యంతో, అమోఘమైన వాచకంతో ఓ ప్రత్యేకమైన ప్రగాఢమైన ముద్రని వేసిన మంచు మోహన్ బాబు ఆయన నేటివ్ ప్లేస్ చిత్తూరులో రియల్ హీరో. ఇది మా ప్రకటన కాదు.. ఆ ప్రాంతంలో ఆయనపై అడుగడుగునా వినిపించే అభినందన. మంచు మోహన్ బాబు తిరుపతిలో 1992 లో శ్రీ విద్యానికేతన్ స్కూల్ ని స్థాపించగా.. ఆ విద్యానికేతన్ లోని దివ్యమైన భోదనా ప్రణాళికలతో దినదినాభివృద్ది చెందుతూ ఈరోజు MBU యూనివర్సిటీ గా గుర్తింపు పొందింది. MBU(మోహన్ బాబు యూనివర్సిటీ) అలాగే శ్రీ విద్యానికేతన్ స్కూల్ ద్వారా కులమతాలకు అతీతంగా ఎంతో మంది అర్హులైన విద్యార్థులకు 25% ఉచిత విద్యను అదించటంతో పాటు పేద విద్యార్థులకి స్కాలర్ షిప్ ఇస్తూ విధ్యను అందిస్తున్నారు.
ఇప్పటికే విద్యానికేతన్ ద్వారా గ్రాడ్యువేట్స్ అయిన ఎంతోమంది స్టూడెంట్స్ దేశవిదేశాల్లో ఆయా రంగాల్లో బాగా రాణిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
శ్రీవిద్యానికేతన్ 30th యాన్యువల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మంచు మోహన్ బాబు ఆయన కుమారుడు హీరో మంచు విష్ణు హైదరాబాద్ లోని ఫిలిం జర్నలిస్టు లని, వారి కుటుంబాలని తిరుపతికి ఆహ్వానించారు. అందరిని సాదరంగా రిసీవ్ చేసుకుని ప్రతిఒక్కరిని పేరు పేరునా పలకరిస్తూ, ఫోటోలు దిగుతూ అందరికి బంధువులా మెలిగారు. అతిధులందరిని తన కుటుంబ సభ్యులులా మార్చుకున్నారు. MBU యూనివర్సిటీ ప్రత్యేకతలని వారి స్టాఫ్ ద్వారా జర్నలిస్ట్ లకి వివరించారు.
మంచు విష్ణు అక్కడి హాస్టల్ విద్యార్థుల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన మోడ్రెన్ కిచెన్ దగ్గర నుండి, యూనివర్సిటీ లాబ్, అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్స్ తో ఏర్పాటు చేసిన లైబ్రరీని, ఆ పరిసర ప్రాంతాలన్నింటిని కూడా పరిచయం చేసారు. MBU లైబ్రరీ అందులోని పెయింటింగ్స్ ని అలా చూస్తుండిపోవాలనిపించేంత గొప్పగా ఉన్నాయి. దాసరి పేరు మీద కట్టించిన యూనివర్సిటీ ఆడిటోరియం, మోహన్ బాబు గారి అత్తమామల జ్ఞాపకార్ధం నిర్మించిన బిల్డింగ్ అన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షణతో నిర్మించిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది.
తదుపరి శ్రీ విద్యానికేతన్ స్కూల్ లో స్పోర్డ్స్ డే ఈవెంట్ లో జర్నలిస్ట్ లకి మరింత ప్రత్యేక ఆతిధ్యం దక్కింది. శ్రీ విద్యానికేతన్ స్పోర్ట్స్ డే లో మార్చ్ పాస్ట్, వివిధరకాల క్రీడల్లో అవార్డ్స్ విన్ అయినవారికి ట్రోఫీ బహుకరించడం, అలాగే గుర్రపు స్వారీ, స్టూడెంట్స్ ఇతర కార్యక్రమాలు అన్నీ మోహన్ బాబు మార్క్ క్రమశిక్షణతో ఆకట్టుకున్నాయి. ఆపై పాత్రికేయ మిత్రులందరికీ మోహన్ బాబు ప్రత్యేకంగా తిరుమల వేంకటేశ్వరుని వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. తిరుమల తిరుపతిలో 11 రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న వేంకటేశ్వరుని వైకుంఠ ద్వారా దర్శనాల్లో భాగంగా సినీ జర్నలిస్ట్ లకి బ్రేక్ దర్శనం కల్పించి.. స్వామివారిని దర్శించుకునే అద్భుత అవకాశం కల్పించిన భక్తవత్సలం నాయుడు విలేఖరులందరికి విశేషమైన భక్తిపూర్వక అనుభవాన్ని అందించారు.
అనంతరం జర్నలిస్ట్ లందరిని మోహన్ బాబు గారు నిర్మించిన షిరిడి సాయిబాబా మందిరానికి ఆహ్వానించి అక్కడ ప్రత్యేకపూజలు నిర్వహించారు. మంచు ఆతిధ్యానికి జర్నలిస్ట్ లందరూ మంత్రముగ్దులయ్యారు. ఈ ఎంటైర్ ప్రోగ్రాంలో మోహన్ బాబు తో పాటు అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ చాలా చురుగ్గా కదిలిన 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు 'మా' అనుకునే కుటుంబం పట్ల తనెంత కేర్ ఫుల్ గా ఉంటాడో చాటుకున్నాడు. అందరినుంచి ప్రత్యేక కృతఙ్ఞతలు అందుకున్నాడు.