యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కర్ణాటక రాజధాని బెంగళూరులో తమ భాషా చిత్రాల కంటే ఇతర భాష చిత్రాలను ఎక్కువగా ప్రదర్శిస్తున్నారంటూ ర్యాలీ జరిపిన కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి బాలీవుడ్ ని సైతం తలదన్ని 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టే చిత్రం వస్తుందని కలలో కూడా ఎవరు ఊహించి ఉండరు. కన్నడ చిత్ర పరిశ్రమ రూపురేఖలను కేజిఎఫ్ ఒక్కసారిగా మార్చేసింది. అలాంటి కేజీఎఫ్ ను తలా తోకాలేని సినిమా అనేశారు కిషోర్ కుమార్.
కిషోర్ కుమార్ ఎవరో అనామకుడు కాదు. కన్నడ చిత్ర కీర్తి పతాకాన్ని జాతీయస్థాయిలో మరోసారి ఎగరేసి చరిత్ర సృష్టించిన కాంతారా సినిమాలో హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి తర్వాత కీలకమైన ఇన్స్పెక్టర్ పాత్రలో నటించిన నటుడు కిషోర్ కుమార్. ఇండియా టుడే తో మాట్లాడుతూ కిషోర్ తాను కేజీఎఫ్ 2 చిత్రాన్ని ఇంతవరకు చూడలేదని అది తనకు నచ్చే తరహా సినిమా కాదని అన్నారు. అలాగే, తప్పో ఒప్పో తెలియదు కానీ ఇది కేవలం తన అభిప్రాయం అంటూ అంతగా విజయం సాధించకపోయినా ఏదైనా ఒక సీరియస్ ఇష్యూ ని డిస్కస్ చేసే చిన్న సినిమానైనా చూడటానికి తన ఇష్టపడతాను కానీ తలా తోకాలేని సినిమాలను మాత్రం చూడలేనంటూ కే జి ఎఫ్ మీద తన అభిప్రాయాన్ని చెప్పేశారు.
ఈ కామెంట్స్ ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారాయి. చరిత్ర సృష్టించిన కే జి ఎఫ్, కాంతారా చిత్రాలు రెండిటినీ హోంబలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్ వారే నిర్మించడం కోసమెరుపు.