సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన అద్భుత దృశ్య కావ్యం ‘శాకుంతలం’. ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం. దీని ఆధారంగా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రసరమ్య దృశ్య కావ్యంగా క్రియేటివ్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుణ శేఖర్ రచన, దర్శకత్వంలో ఆవిష్కృతమవుతోన్న ఈ ప్రేమ కావ్యం ట్రైలర్‌ని తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే త్వరలో అందరూ ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. అంత అద్భుతంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. దుష్యంత పురు రాజవంశం యొక్క వైభవాన్ని గ్రాండియర్‌గా, కళ్లు చెదిరేలా అసాధారణంగా తెరకెక్కించారాయన.
ట్రైలర్‌లో.. ఈ భూమి మీద అమ్మానాన్నలకు అక్కరలేని తొలి బిడ్డ మేనక, విశ్వామిత్రల ప్రేమకు గుర్తుగా ఈ పాప పుట్టింది అంటూ.. అత్యద్భుతమైన విజువల్స్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. సుందరమైన అడవి, అందులో ఉన్న పక్షులు, జంతువుల నడుమ పెరుగుతున్న శకుంతలను సీతాకోకచిలుకల రెపరెపల మధ్య పరిచయం చేసిన తీరు ఆకర్షణీయంగా ఉంది. శకుంతల ఒక కారణజన్మురాలని తెలుపుతూ.. ఆ తర్వాత దుష్యంతుడు ఆమెని చూడటం, ప్రేమ, గాంధర్వ వివాహం వంటివన్నీ ఈ ట్రైలర్‌లో చూపించారు. మరోవైపు దుష్యంత మహారాజు రాజ్యాన్ని బాహుబలి రేంజ్‌లో ప్రజంట్ చేశారు. ఆ సన్నీవేశాలన్నీ విజువల్లీ వండర్ అంతే.
ప్రశాంతమైన ఈ తపోవనంలో ఏదో అశాంతి ఆవహిస్తోంది అంటూ గౌతమి చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ రూపురేఖలు మారిపోయాయి. అసుర గణం ఒకవైపు, స్వచ్ఛమైన శకుంతల ప్రేమకి దుర్వాసుల వారి ఆగ్రహం, కశ్యపు మహర్షుల వారి అనుగ్రహానికి నడుమ.. శకుంతల పడే కష్టాలను చిత్రీకరించిన తీరు అబ్బుర పరుస్తోంది. అయితే కర్మకు ఎవరూ అతీతులు కారు అని చెబుతూ.. దుష్యంత మహారాజు, శకుంతలను గుర్తుపట్టని విధంగా ప్రవర్తిస్తే.. నిండు చూలాలుగా ఉన్న శకుంతల పలికే డైలాగ్స్ హైలెట్ అనేలా ఉన్నాయి. ఆ తర్వాత ఒక భారీ యుద్ధం. ఇక భరతుడి (అల్లు అర్జున్ కుమార్తె అర్హ)ని పరిచయం చేస్తూ ట్రైలర్‌ని ముగించిన తీరు.. వావ్ అనిపిస్తుంది. మొత్తంగా అయితే.. అజరామరమైన ప్రణయగాథని గుణశేఖర్ ప్రాణం పెట్టి తెరకెక్కించాడనేది.. ప్రతి ఫ్రేమ్‌లో తెలుస్తుంది. గుణశేఖర్‌ని ఎపిక్ ఫిల్మ్ మేకర్ అని ఎందుకు అంటారో.. మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకులకు తెలియబోతోంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు. ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు ప్రేక్షకులు సిద్ధమైపోండి అనేలా క్లారిటీ ఇచ్చేశారు. కాగా, ఫిబ్రవరి 17న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకాబోతోంది.