‘రవితేజ ఎంటర్ అయిన తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా మరో లెవల్‌లో ఉంటుంది. ఆ పాత్ర రవితేజ చేయకపోతే మాత్రం న్యాయం జరిగేది కాదు’ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన హీరోగా, రవితేజ కీలక పాత్రలో.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం వైజాగ్‌లో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..
‘‘ఈ సినిమా కథ అనుకున్నప్పుడు.. మాస్ మహారాజా రవితేజ. నా బ్రదర్. ఆజ్ కా గూండారాజ్ సినిమాలో ఒక స్నేహితుడి వేషం వేశాడు. హిందీలో బాగా మాట్లాడేవాడు. పుట్టింది బెజవాడే కానీ.. పెరిగింది అంతా బొంబేలోనే. తను, తను స్టయిల్, తను మాట్లాడే హిందీ.. ఇదంతా చూసి.. అప్పట్లో మాకు బొంబే హీరో అనిపించేవాడు. అమితాబ్‌ని అమితంగా ప్రేమించేవాడు. సౌత్‌కి వస్తే.. నేనంటే ఇష్టమని అప్పటి నుంచి చెప్పేవాడు. ఆ తర్వాత ‘అన్నయ్య’ సినిమా చేశాం. రవితేజతోటి ఎప్పుడున్నా కూడా.. ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది. యాక్టింగ్ మీద దృష్టి పెట్టనివ్వడు.. ఓ.. కబుర్లు చెప్పేస్తూ ఉంటాడు. ఎంటర్‌టైన్ చేసి.. నవ్వించేస్తుంటాడు. చాలా గందరగోళం సృష్టించేస్తాడు. చాలా అల్లరి పిల్లోడు. అలాంటి రవి.. నేను చూస్తుండగానే.. అలా అలా ఎదిగి.. ఈ రోజు మాస్ మహరాజ్ అంటూ.. తనకంటూ ఒక ముద్ర వేసుకుని, తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకున్నటువంటి చక్కటి నటుడు. ఖాళీగా ఉంటే రవితేజ సినిమాలు బాగా చూస్తుంటాను. ఎందుకంటే.. అందులో అన్నీ మిక్సయి ఉంటాయి.. వెటకారం కూడా ఉంటుంది. అవన్నీ నాకు బాగా నచ్చుతాయి.
ఎప్పుడైతే బాబీ ఈ పాత్రకి తను ఉండాలని అన్నాడో.. అప్పుడు నాకు భలే ఉత్సాహంగా అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగే పాత్రలు మా ఇద్దరివి. రవితేజ ఎంటర్ అయిన తర్వాత సినిమా మరో లెవల్‌లో ఉంటుంది. ఆ పాత్ర రవితేజ చేయకపోతే మాత్రం న్యాయం జరిగేది కాదు. బాబీ చెప్పినట్లుగా రవితేజ ఉండబట్టే.. ఈ కథ ఇంకో లెవల్‌కి వెళ్లడానికి ఆస్కారం ఏర్పడింది. ఇండస్ట్రీలో వరసబెట్టి సినిమాలు చేస్తుంది ఇద్దరే ఇద్దరు. ఒకటి రవితేజ.. రెండు నేను. అంత బిజీలో ఉండి కూడా ఈ సినిమాకు డేట్స్ కేటాయించిన రవితేజకి థ్యాంక్స్’’ అని చెప్పుకొచ్చారు.