ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో.. జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి స్వయంగా పవన్ కల్యాణ్ వెళ్లి కాసేపు ముచ్చటించారు. పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అయితే ఈ భేటీపై రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నా.. పవన్ కల్యాణ్ కలిసింది మాత్రం చంద్రబాబును పరామర్శించేందుకే అని తెలుస్తుంది.
ఇటీవల ఏపీలో చంద్రబాబు రోడ్ షోలకు జగన్ ప్రభుత్వం ఆంక్షలు విధించడమే కాకుండా చంద్రబాబుని నిర్భంధించే ప్రయత్నాలు చేసింది. చంద్రబాబు కూడా అక్కడి ప్రభుత్వంపై, పోలీస్ అధికారులపై సీరియస్ అయ్యారు. సడెన్‌గా తీసుకొచ్చిన జీవోపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అంతకుముందు పవన్ కల్యాణ్‌ని వైజాగ్‌లో వైసీపీ ప్రభుత్వం నిర్భంధించినప్పుడు.. చంద్రబాబు పరామర్శించిన విషయం తెలిసిందే. అప్పుడు విజయవాడలోని ఓ హోటల్‌లో చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు. అప్పుడు కూడా రకరకాలుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ భేటీ వెనుక కారణం పరామర్శే అని ఆ తర్వాత వారిద్దరూ క్లారిటీ ఇచ్చారు.
ఇప్పుడు కూడా ఏపీలో చంద్రబాబుని స్వయంగా తన నియోజకవర్గమైన కుప్పంకు రానివ్వకుండా.. వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించి.. ఇబ్బందులకు గురిచేసింది. అందుకే హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుని స్వయంగా పవన్ కల్యాణ్ వెళ్లి పరామర్శించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఇద్దరూ కాసేపు చర్చలు జరిపారు. అంతే తప్ప.. పొత్తులు వగైరా వగైరా వంటి వాటి గురించి ఈ భేటీలో ఎటువంటి చర్చలు జరగలేదని తెలుస్తోంది.