చిరుకి 5.. బాలయ్యకి 4.. విజయ్‌కి 8.. ఏంటీ అంకెలు అనుకుంటున్నారా? సంక్రాంతి ఫైట్‌లోకి దిగుతోన్న హీరోలకి దక్కిన థియేటర్లు. మొదటి నుంచి వినిపిస్తున్నట్లుగానే సంక్రాంతికి దిల్ రాజు డామినేషనే కనిపిస్తోంది. వైజాగ్‌లో ‘వారసుడు’ సినిమా 8 థియేటర్లలో విడుదలవుతుంటే.. చిరు ‘వాల్తేరు వీరయ్య’ 5 థియేటర్లలో, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ 4 థియేటర్లలో విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి అధికారిక అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంక్రాంతికి నాలుగు సినిమాలు ఆడే స్పేస్ ఉంటుంది. ఇది వ్యాపారం.. నా సినిమాని ఆపుకుని వేరే వాళ్ల సినిమాలకు థియేటర్లు ఇవ్వమంటారా? అంటూ రీసెంట్‌గా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయం తెలిసిందే. అంతేకాదు, మేము మేము అంటే మైత్రీ మూవీ మేకర్స్, మేము కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయంలోకి థర్డ్ పర్సన్ ఎందుకు ఎంటర్ అవుతున్నారంటూ కూడా ఆయన సీరియస్ అయ్యాడు. థర్డ్ పర్సన్ ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చిందనేది.. పై థియేటర్ల కొలమానం చూస్తుంటేనే అర్థమవుతుంది. అయినా కూడా దిల్ రాజు డామినేషన్ కనబడుతూనే ఉంది. మరి ఇదే స్థాయిలో కోలీవుడ్‌లో చిరు, బాలయ్య సినిమాలకు థియేటర్లు ఆయన ఇప్పించగలడా? అంటే.. అక్కడ మాత్రం విజయ్, అజిత్ స్టార్ హీరోలని, ఇక్కడికి వచ్చే సరికి నేను తెలుగు ప్రొడ్యూసర్‌ని, సినిమా తీసింది తెలుగు దర్శకుడు అని.. దిల్ రాజు ఏవేవో లెక్కలు చెబుతుండటం విశేషం. అదే.. చిరంజీవి సినిమా కానీ, లేదంటే బాలయ్య సినిమా కానీ.. వీటిలో ఏదైనా ఒక సినిమా మైత్రీ కాకుండా వేరే బ్యానర్‌లో రూపుదిద్దుకుని ఉంటే.. అప్పుడు పరిస్థితి ఏంటనేది ఆయనకే తెలియాలి. రెండు సినిమాలు ఒకే బ్యానర్ కావడంతో.. పండగకి మేము కూడా బిజినెస్ చేసుకోవాలి కదా.. అన్నట్లుగా దిల్ రాజు మాట్లాడటంతో.. ఇండస్ట్రీ తరపు నుంచి కూడా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది.
సరే విషయానికి వస్తే.. పై థియేటర్లు కేటాయింపు వైజాగ్‌కు సంబంధించినది. మరి వైజాగ్‌లోనే దిల్ రాజు ఇలా డామినేషన్ ప్రదర్శిస్తే.. ఇక నైజాంలో ఏ రేంజ్‌లో ఆయన చెలరేగిపోనున్నాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దిల్ రాజు తెలుగు నిర్మాతే కావచ్చు, ‘వారసుడు’ సినిమా తీసింది తెలుగు దర్శకుడే కావచ్చు.. సినిమాల స్థాయి పాన్ ఇండియా రేంజ్‌కి చేరి ఉండవచ్చు.. కానీ తనని ఇంతవాడిని చేసిన ప్రేక్షకులని ఆయన ఈ విషయంలో థర్డ్ పర్సన్స్‌గా చూడటమే.. ఎక్కడో తేడా కొడుతుంది. మరి దీనిని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.