Advertisement
Google Ads BL

కైకాల సత్య నారాయణ ఇక లేరు


గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నవరస నటన సార్వభౌమ కైకాల సత్య నారాయణ (87) శుక్రవారం ఉదయం 4 గంటలకు హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసంలో కన్నుమూసినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా విషాధ ఛాయలు అలుముకున్నాయి. కైకాల సత్యనారాయణ లెజండరీ యాక్టర్. నేటి నటీనటులెందరికో ఆయన స్ఫూర్తి. దాదాపు 60 సంవత్సరాల పాటు సినీ జీవితంలో ఉన్న కైకాల.. 800కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన వేయని వేషం లేదు. ఆయన చేయని పాత్ర లేదు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలెన్నో చేశారు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించారు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన.. నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్.వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరుగా పేరుని గడించారు.

Advertisement
CJ Advs

 

కృష్ణాజిల్లా, గుడ్లవల్లేరు మండలం.. కౌతరం గ్రామంలో కైకాల సత్యనారాయణ 1935 జులై 25న జన్మించారు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో సినీరంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆయన ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించి.. విలనిజానికి కొత్త అర్థాన్నిచ్చారు. ఆయనకు 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 1996లో కైకాల రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. నటుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. సిపాయి కూతురు చిత్రంతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం.. ప్రేమ నగర్, తాత మనవడు, దాన వీర శూర కర్ణ, యమగోల, శుభలేఖ, శృతిలయలు, రుద్రవీణ, గ్యాంగ్‌లీడర్, భైరవద్వీపం, ఘటోత్కచుడు, మురారి, అరుంధతి.. వంటి ఎన్నో చిత్రాల వరకు సాగింది. ఈ మధ్య సంచలనం సృష్టించిన కెజియఫ్ చిత్రాన్ని కూడా ఆయన సమర్పించారు. కైకాల చనిపోయే వరకు సినిమాతోనే అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఆయన మరణం యావత్ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కైకాలకు సినీజోష్ నివాళులర్పిస్తోంది. కాగా, కైకాల అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నారని సమాచారం. 

Kaikala Satyanarayana No More:

Senior Actor Kaikala Satyanarayana Passes Away
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs