నిన్న సోమవారం సినిమా ఇండస్ట్రీలో కలకలం రేగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ పై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లోని మైత్రి మూవీస్ ఆఫీస్ అలాగే నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఇళ్లతో పాటుగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం మైత్రి మూవీస్ లో పలు సినిమాలు నిర్మాణంలో ఉండగా, మరికొన్ని సినిమాలు సెట్స్ మీదకి వెళ్ళబోతున్న సమయంలో మైత్రి మూవీస్ వారిపై ఐటి దాడులు హాట్ టాపిక్ అయ్యాయి.
నిన్న సోమవారం ఉదయం 11 గంటల నుండి అర్ధరాత్రి వరకు జరిగిన సోదాల్లో మైత్రి ఆఫీస్ అలాగే నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ ఇళ్లలో కొన్ని ముఖ్యమైన ఫైల్స్, అలాగే కొన్ని హార్డ్ డిస్క్ లు ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మైత్రి వారిని హీరోల పారితోషకాలు, సినిమా బడ్జెట్ ల వివరాలు, రెవిన్యూ వివరాలపై ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అధికారులు పన్ను చెల్లింపులలో వ్యత్యాసాలను గుర్తించినట్లుగా సమాచారం.
అటు మైత్రి మూవీస్ నిర్మాతలు మాత్రం ఇదంతా రొటీన్ చెకింగ్స్ లో భాగంగానే ఈ సోదాలు జరిగినట్లుగా మీడియాకి తెలపడం గమనార్హం. అయితే ఈ సోదాలు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మొదలైన నెక్స్ట్ డే జరగడం పై ఇదేమన్నా రాజకీయకోణంలో జరిగిన సోదాలేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.